టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం ప్ర‌కారం.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ పంథాను మార్చుకున్న‌వారు చాలా మంది ఉన్నారు. ఇలా చంద్ర‌బాబు వ్యూహం ప్ర‌కారం.. ఆయ‌న చెప్పిన‌ట్టు విన్న‌వారు ఒక్క‌రు కూడా విజ‌యం సాధించ‌లేదు. దీంతో కొంద‌రు పార్టీకి దూరంగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ మారిపోయారు. అయితే.. బాబుపై ప్రేమ‌లేక‌కాదు.. టీడీపీపై అభిమానం లేక అంత‌క‌న్నా కాదు. కానీ, ఇప్పుడు కూడా బాబు వ్యూహం మేర‌కు న‌డిచే ఉద్దేశం వారికి లేదు. త‌మ పాట్లేవో తాము ప‌డతామ‌ని వారు నిర్మొహ‌మాటంగా చెబుతున్నారు. సో.. ఇప్పుడు బంతి చంద్ర‌బాబు కోర్టులోనే ఉంది.

పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. పార్టీలు మారిన వారు కూడా.. అవ‌స‌రార్థం పార్టీ మారారే త‌ప్ప‌.. టీడీపీపై వ్య‌తిరేక‌త‌తో కాదు. సో.. ఇప్పుడు వీరంతా కూడా త‌మ మాటే చెల్లుబాటు అవుతుందంటే.. తాము పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు.. తిరిగి పార్టీలో చేరేందుకు సంసిద్ధ‌మేన‌ని వ‌ర్త‌మానం పంపారు. స‌రే.. గ‌త ఎన్నిక‌ల్లో ఏం జ‌రిగిందో చూద్దాం. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో చంద్ర‌బాబు చేసిన ప్ర‌యోగాలు విక‌టించాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఒంగోలు ఎంపీగా అప్ప‌ట్లో మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావును నిల‌బెట్టారు. వాస్త‌వానికి ఆయ‌న అప్ప‌ట్లోనే తాను గెలిచేది లేద‌ని.. ఎందుకు వృథా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. కానీ, చంద్ర‌బాబు వినిపించుకోకుండా ముందుకు వెళ్లారు. ఫ‌లితంగా ఆయ‌న ఓడిపోయారు.

త‌ర్వాత శిద్దా పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వ‌చ్చినా.. త‌న నియోజ‌క‌వ‌ర్గం ద‌ర్శి నుంచే పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. అదేవిధంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా ఉంటూ.. వైసీపీ త‌రఫున గెలిచిన ఆదినారాయ‌ణ రెడ్డి త‌ర్వాత‌.. కాలంలో బాబుకు జై కొట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈయ‌న తిరిగి ఇక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌ని చెప్పినా కాద‌ని.. క‌డ‌ప‌కు పంపారు. దీంతో ఆయ‌న కూడా ఓడిపోయి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆది కూడా టీడీపీవైపు చూస్తున్నారు. అయితే.. ఆయ‌న మాత్రం జ‌మ్మ‌ల‌మ‌డుగే ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక‌, న‌ర‌సారావు పేట ఎంపీగా.. అప్ప‌టి సిట్టింగ్ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. తిరిగి గెలిచే ప‌రిస్థితి లేద‌ని.. ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు చెప్పాయి. దీంతో బాబు వెన‌క్కి త‌గ్గారు. అయితే.. అప్ప‌టి వేడిలో ఆయ‌న ఎక్క‌డ వైసీపీలోకి జంప్ చేస్తారోన‌ని భావించిన చంద్ర‌బాబు చివ‌రి నిముషంలో సీటు ఖ‌రారు చేశారు. అయితే.. ఆయ‌న కూడా ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు ఈ టికెట్ త‌న కుటుంబానికే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అదేస‌మ‌యంలో మ‌చిలీప‌ట్నం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు కూడా త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడికి అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. కానీ, చంద్ర‌బాబు వినిపించుకోని ఫ‌లితంగా ఇక్క‌డ నారాయ‌ణ‌రావు ఓడిపోయారు.

ఇక‌, న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపొయిన‌.. వేటుకూరి వెంక‌ట శివ‌రామరాజు.. ఉర‌ఫ్ శివ‌ను నిల‌బెట్టారు. ఈయ‌న కూడా త‌న‌కు ఈటికెట్ వద్ద‌ని.. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాన‌ని చెప్పారు. కానీ, బాబు ప‌ట్టుబ‌ట్టి టికెట్ అంట‌గ‌ట్టారు. దీంతో ఈయ‌న కూడా ఓడిపోయారు. ఇలా.. రాష్ట్రంలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలానే వ‌ద్ద‌న్న‌వారికి చంద్ర‌బాబు ఎంపీ టికెట్లు ఇచ్చారు. ప‌లితంగా వారంతా ఓడిపోయారు. ఇప్పుడు మాత్రం వీళ్లు.. మ‌ళ్లీ అసెంబ్లీ వైపే చూస్తున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నిర్ణ‌యం క‌నుక త‌మ‌కు సానుకూలంగా రాక‌పోతే.. పోటీకి దూరంగా ఉండాల‌నే నిర్ణ‌యం దిశ‌గా ఈ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: