తెలుగు రాజకీయాలు అంటే చమత్కారాలు, వ్యంగ్యాలు, సున్నితమైన వ్యాఖ్యానాలు, శ్లేషార్ధాలు ఇలా చాలా చెప్పుకోవాలి. విధ్వత్తు అంతా మాటలలో చేర్చి అద్భుతమైన ఉపన్యాసాలతో రంజింపచేసే శిఖరాయమాయమైన నాయకులు ఏలిన రోజులు గుర్తుకు వస్తాయి.

అటువంటి తెలుగు రాజకీయాలు ఇపుడు ఎలా మారిపోయాయి అనిపించకమానదు. అపర గాంధీ, ఆంధ్రా గాంధీ అనిపించుకున్న నిస్వార్ధ జీవి, స్వచ్చమైన ప్రజా సేవకుడు వావిలాల గోపాలక్రిష్ణయ్య బతికి ఉన్న రోజులలోఒకప్పుడు  వైఎస్సార్, చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం పరాకాష్టకు చేరింది. దాంతో ఇద్దరి తగవు తీర్చడానికి తీర్పరి కావాల్సివచ్చారు. ఆ టైమ్ లో వావిలాల వారి  సమక్షంలో ఎవరి మాట నిజమో తేల్చుకుందామని అటూ ఇటూ  భారీగానే సవాల్ చేసుకున్నారు. అయితే ఈ గొడవ అంతా విన్న వావిలాల వారు ఆనాడే దండం పెట్టేశారు. మీ రాజకీయాల్లోకి దయచేసి నన్ను లాగవద్దు మహాప్రభో అని మొరపెట్టుకున్నారు.

ఇది జరిగి అచ్చంగా మూడు దశాబ్దాల కాలం అవుతోంది. ఇపుడు నాటి కంటే కూడా ఇంకా దారుణంగా రాజకీయాలు దిగజారాయి అనిపిస్తోంది అని ఎవరైనా భావిస్తే తప్పు వారిది కాదు. ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీలు గట్టిగానే ఉన్నాయి. ఒకరు తలుపులతో కొడితే మరొకరు తమలపాకులతో కొట్టరు కదా. అందుకే ఈ రచ్చ అంతా. ఏపీ రాజకీయాల్లో రెచ్చగొట్టుడు ధోరణి పెరిగింది. నాయకుల భాష కూడా మారిపోయింది. బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ చేంజి అయింది.  అసహనం హెచ్చింది. అందుకే దూషణ పర్వం నుంచి దాడుల దాకా కధ మలుపు తిరిగింది అని అనుకోవాలి.

ప్రజల అటెన్షన్ తమ వైపు ఉండాలనుకుని ఎప్పటికపుడు  టెన్షన్ క్రియేట్ చేసే పాలిటిక్స్ పెరిగింది. ఈ రొచ్చులో ఉచ్చులో చోటా నుంచి బడా నాయకుల వరకూ అందరూ చిక్కుకుంటున్నారు. రాజ్యాంగ పదవులలో ఉన్న వారి మీద దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఒకరిని అనడం నాలుగు తినడం ఘనమని భావిస్తున్నారు. ఇందులో తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అని చెప్పడానికి కూడా అసలు వీలు లేదు. ఈ ధోరణి ఇంకా పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. మరి ఇలాగే సాగితే జనం ఇంకా రాజకీయాల పట్ల వైముఖ్యం పెంచుకుంటారంతే. అంతకు మించి రాజకీయాల్లో అయితే మార్పు అసలు రాదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap