ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాష్ట్ర  బంద్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పిలుపు నిచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ... రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిసే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో దాడి జరుగుతుందని తానే స్వయంగా డీజీపీకి 5 గంటల 20 నిమిషాలకు ఫోన్ చేస్తే..... డీజీపీ కనీసం స్పందించలేదని ఆరోపించారు. గవర్నర్, కేంద్ర మంత్రి కూడా ఫోన్‌లో సమాధానం ఇచ్చారని... కానీ వారి కంటే డీజీపీకి మాత్రం అత్యంత ముఖ్యమైన పనులున్నాయా అని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా బూతులు మాట్లాడలేదన్నారు చంద్రబాబు. అసభ్య పదజాలం వాడినట్లు ఒక్కసారి అయినా రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. కానీ తనపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడినా కూడా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీస చర్యలు కూడా తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెద్ద ఎత్తున సాగు అవుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో గంజాయి సాగు పెద్ద ఎత్తున జరుగుతోందని... విశాఖ ఏజెన్సీ నుంచే గంజాయి అక్రమ రవాణా అవుతోందని ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలు చేస్తున్నారన్నారు చంద్రబాబు. రెండున్నర ఏళ్లుగా అధికార పార్టీతో కలిసి డీజీపీ వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికే డీజీపీపై పోలీసు శాఖలోని కొంత మంది తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ గౌతమ్ సవాంగ్... నేరస్థులతో చేతులు కలిపారని ఆరోపించారు. రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: