ఒక పార్టీ దేవాలయంగా భావించే కార్యాలయంపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలి అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపునివ్వగానే మొట్టమొదటగా స్పందించింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. పార్టీ ఆఫీసులపై ఈ తరహా దాడి ప్రజాస్వామ్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగిందనీ, ఈ దుస్సంప్రాదాయాన్ని, కుసంస్కారాన్ని అందరూ అడ్డుకోవాల్సిన అవసరముందన్న విధంగా టీడీపీ కార్యాలయంపై అధికార వైసీపీ దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ఏ మాత్రం క్షేమకరం కాదనీ, వైసీపీ దాడి దౌర్జన్యానికి, అరాచకానికి నిదర్శనమని జనసేనాని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

పార్టీ ఆఫీసులపై దాడులు ఖండించాలనీ, బుధవారం రాష్ట్ర బంద్‌కు పార్టీలన్నీ సహకరించాలనీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోరిన క్రమంలో మొట్టమొదటగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయనీ, వైసీపీని గద్దె దించడానికి ఇరు పార్టీలు ఒకేతాటిపైకి వచ్చి నడుస్తాయని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ ఎందుకు అంతగా ప్రాధాన్యం ఇస్తుందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఒకే ఒక్క సీటును జనసేన పార్టీ గెలుచుకుంది. అలాంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ అంతగా ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా? అని తెలుగు తమ్ముళ్ల వాదనగా వినిపిస్తోంది.

మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేనాని పవన్ కల్యాణ్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమ రాజకీయ శత్రువు వైసీపీపై జనసేనాని పవన్‌ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న క్రమంలో ఆయనతో వైరం కంటే... స్నేహాన్ని పునరుద్ధరించుకోవడమే సమంజసమని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. పైపెచ్చు అధికార వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించడంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి దగ్గరగా జనసేనాని వాయిస్, అడుగులు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయమనీ, వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి ఖాయమనీ విశ్లేషణలు వెలువడుతున్నాయి తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ వీడియో రిలీజ్ చేయడం రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు బలం చేకూరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: