తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు బయటికి వచ్చారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని గంటా అన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య కాదా? అని ఆయన ప్రశ్నించారు. పట్టాభి మీడియా సమావేశంపై మీకు అభ్యంతరాలు ఉండొచ్చు, తప్పేమీ కాదు, కానీ దానికి అనుసరించాల్సిన విధానాలు కచ్చితంగా ఇవి మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది అధికారంలోని వైసీపీ ప్రభుత్వం అని, అలాంటిది ఆ పార్టీ వారే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరికి చెప్పాలి? ఆ మాత్రం కనీస విఘ్నత టీడీపీ కార్యాలయాల మీద దాడి చేయమని సలహా ఇచ్చిన వారికి తెలియదా? అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. నిజంగా వైసీపీ వారు డ్రగ్స్ వ్యాపారాలు చేయకపోతే, గంజా స్మగ్లింగ్ నిర్మూలనకు చిత్తశుద్ధి ఉంటే.. ప్రతిపక్ష నేతల విమర్శలను ఖండించాలనీ, రాజకీయ విమర్శలను ఎదుర్కోవడం నాయకుడి సహజ లక్షణం కావాలనీ, కానీ ఇలా ఫ్యాక్షనిజంను తలపించేలా దాడుల ఘటనలు చోటు చేసుకోవడం బాధగా ఉందని గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తారని గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

అయితే ఇన్నాళ్లు సైలెంట్‌గా, పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాల్లో పాల్గొనకుండా, అసలు తాను టీడీపీలో ఉన్నానో లేదో అనేలా ఉన్న గంటా శ్రీనివాసరావు.. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపై బయటికొచ్చి మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో పలు రకాలుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశంలో స్తబ్దుగా ఉన్న నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌ అయిన క్రమంలోనే గంటా శ్రీనివాసరావు స్పందించారనీ, పట్టాభి ఇల్లు, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడుల ఘటనలు ఆయనకు కలిసొచ్చాయన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇటీవల గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి రాజీనీమా చేసినట్లుగా  ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తెలుగుదేశంలో గంటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గ్రహించారు. ఆయనతో త్వరలో సమావేశమై వైసీపీలోకి చేర్చుకోవాలనీ, దీనిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడే చాన్స్‌ ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పాలనపై ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేకత, అసహనం అధికం అవుతున్నట్లు గంటా గ్రహించారనీ, అందుకే బయటకు వచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారనీ ఆయన అనుచరవర్గాల ద్వారా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: