యాదాద్రి ఆలయం పునర్‌వైభవం కోసం కృషి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఆలయం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆలయాన్ని తిరిగి ప్రారంభించే తేదీని కూడా కేసీఆర్ తాజాగా ప్రకటించారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ద్వారా యాదాద్రి ఆలయాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. అయితే.. ఈ ఆలయ గర్భగుడి గోపురాన్ని బంగారు తాపడం చేయించేందుకు దాతలు విరాళం ఇవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. తొలి విరాళంగా తాను కిలో బంగారం ఇస్తానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మరికొందరు కూడా అప్పుడే విరాళం ప్రకటించారు.


అయితే యాదాద్రి గర్భగుడి గోపురం తాపడం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి తొలి విరాళాన్ని కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, జడ్పీటీసీ మోడెం జయమ్మ ప్రకటించారు. యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం కోసం తాను  కిలో బంగారం విరాళంగా ఇస్తానని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణానికి చేపట్టి, పూర్తిచేయడం ఒక గొప్ప యజ్ఞం అని ఆమె ప్రశంసించారు. అతి త్వరలో ఆ దేవాలయాన్ని పునః ప్రారంభించబోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని
కడప జిల్లా వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ తెలిపారు.


యాదాద్రి పునర్నిర్మాణంలో గర్భగుడిని బంగారు తాపడంతో చేపడుతున్నామని ముఖ్యమంత్రి అన్నారని.. 125 కిలోల బంగారం అవసరమని కేసీఆర్ గారు ప్రకటించారని.. ఆయన పిలుపు  మేరకు నేను, నా కుటుంబ సభ్యులందరం కలిపి ఒక కేజీ బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ప్రకటిస్తున్నామని మోడెం జయమ్మ చెప్పారు. ఇందుకు సంబంధించిన చెక్కును గౌరవ సీఎం కేసీఆర్ గారిని మరోసారి యాదాద్రి పర్యటన సందర్భంగా కలిసి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అందజేస్తామని ఆమె వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి అంటే నాకు ఎంతో నమ్మకం, ఇష్టమని మోడెం జయమ్మ తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, గౌరవ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని జయమ్మ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: