టీడీపీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ క్యాడర్ కు అండగా ఉన్నామని సంకేతాలు ఇచ్చేలా బంద్ చేస్తున్నారు. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ విషయం తెలియగానే స్పందించారు. తన విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. అప్పటికప్పుడే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో కూడా చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

సీఎం జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రిని గౌరవంగా సంభోదించామని.. ఇలా సైకో బుద్ధి చూశాక.. ఇకపై శాడిస్ట్, డ్రగ్గిస్ట్ అంటానని అన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే.. టీడీపీ నేతలపై.. కార్యాలయాలపై దాడులకు పాల్పడుతారా అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ చేతకాని పార్టీ కాదని.. నీ పతనానికి నీవే ఇటుకలను పేర్చుకుంటున్నావంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు. వైసీపీ నేతలను త్వరలోనే ఉరికించి కొడతామని కూడా అన్నారు. క్యాడర్ కు చంద్రబాబు కనుసైగ చేస్తే.. ఫ్యాన్ రెక్కలు విరిచి.. రాష్ట్రం దాటేలా కొడతామని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నారా లోకేష్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారని తెలుస్తోంది. అసలే లోకేష్ బయటికొచ్చి చాలా రోజులైంది. ఆ మధ్య పార్టీ నేతలను పరామర్శించిన అనంతరం ఇప్పటివరకూ బయటకు రాలేదు. అయితే ఈ రోజు జరిగే బంద్ లో మాత్రం ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలుస్తోంది. టీడీపీ శ్రేణులతో కలిసి.. వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు లోకేష్ ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. లోకేష్ పోటీచేసిన మంగళగిరిలో కూడా టీడీపీ కార్యాలయంపై దాడి జరగడంతో.. ఆయనే స్వయంగా బంద్ లో పాల్గొంటారని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ దాడుల విషయంలో కాస్తో కూస్తో టీడీపీపై ప్రజల్లో సింపతీ పెరిగింది. అదే సమయంలో టీడీపీ నాయకుల మాటలపై కూడా వ్యతిరేకత వస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను, జరిగే పరిణామాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: