కడప జిల్లా బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే సతీమణి దాసరి సుధను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం చేపట్టింది. మామూలుగా అయితే ఇటువంటి సందర్భాల్లో ఎన్నికలు ఏకగ్రీవమై పోతాయి. కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ నుంచి తప్పుకొంది. జనసేన కూడా పోటీ చేయట్లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రం పోటీలో నిలిచాయి. అధికార పార్టీపై ఎలాగైనా ఆధిపత్యం చూపించాలని ఈ ఎన్నికలను గెలవాలని వ్యూహరచన చేస్తున్నాయి.

బద్వేల్ ఉపఎన్నికలలో వైసీపీతో పాటూ బీజేపీ, కాంగ్రెస్, మరికొన్ని చిన్న పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 35 మంది నామినేషన్లు వేయగా.. నామినేషన్లు ఉపసంహరించుకునే సమయానికి 15 మంది అభ్యర్థులు పోటీలు ఉన్నారు. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రచారంలోనూ దూకుడు పెంచింది. గెలుపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు కూడా ఈ ఎన్నికల విషయంలో సూచనలు ఇస్తున్నారు. ఎలాగైనా సరే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు కష్టపడుతున్నారు.

అయితే.. బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే.. ఇప్పటికే బద్వేల్ గెలుపు ఓటములపై జనం కూడా ఓ అంచనాకు వచ్చేశారు. అయితే మెజార్టీదే అసలు లెక్కంతా. ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోలేకపోయిన బీజేపీ.. బద్వేల్ ఉప ఎన్నికలపై మాత్రం గట్టి నమ్మకం పెట్టుకుంది. గెలుపు దరిచేరకపోయినా కనీసం రాష్ట్రంలో పార్టీ పటిష్ట పడిందనే భావన ప్రజల్లో వస్తే చాలనుకుంటోంది. అందుకే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. టీడీపీ, జనసేన కూడా బరిలో లేవు కాబట్టి బీజేపీ బలం ఎంతో ఈ ఎన్నికలతో తేలిపోతుంది. ప్రధాన పార్టీలేవీ బరిలో లేవు కాబట్టి.. ఆమేర బీజేపీ బలపడితే మాత్రం కాషాయదళంలో కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలోల లాగా నోటాతో పోటీపడితే మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఏపీలో బీజేపీకి ఆదరణే ఉండదని స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: