మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ అదే మాట అన్నారు, లేటెస్ట్ గా చంద్రబాబు కూడా తన లేఖలో ఇదే విషయం రాశారు. ఇప్పుడు అదే విషయం తర్వాత ఎవరి నోటి నుండి వస్తుందనేది ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి బీసీ జనగణన చేపట్టాలన్న వరుస డిమాండ్లు ఢిల్లీని తాకుతున్నాయి. ఉన్నట్టుండి బీసీల లెక్కలపై డిమాండ్లు ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా? ఏపీలో బీసీ జనగణన చేపట్టాలని తాజాగా చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. బీసీ కులాలకు సంబంధించి సరైన డేటా లేకపోవడంతో చాలా వర్గాలకు అన్యాయం జరుగుతోందని అందులో తెలిపారు. ఉన్నట్లుండి బాబు, కేసీఆర్  ఎందుకు బీసీల లెక్కల కోసం పట్టుబడుతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారు, ఐదు గ్రూపులుగా ఉన్న బీసీలకు మొత్తంగా 25 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే బిసి గ్రూపుల్లోని కులాల మధ్య అసమానతలున్నాయి. వాళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా కొన్ని కులాలే ఎగరేసుకు పోతున్నారని ఎంబీసీలు అంటున్నారు. నిజానికి బీసీల్లో, ఎంబిసి కులాలేవో చెప్పడానికి ప్రభుత్వాల దగ్గర కూడా సరైన లెక్కలు లేవు. అందుకే ఎవరు బిసి? ఎవరు ఎంబీసీ?  ఎవరి కోసం ఏం చేయాలనే దానిపై ప్రభుత్వాలకు కూడా స్పష్టత రావాల్సి ఉంది.

 అందువల్ల బీసీ జనగణన పక్కాగా జరిగితేనే సంక్షేమ ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ బీసీ జన గణన చేపట్టాలని  తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు  అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అప్పుడే కేంద్రానికి లేక పంపారు. కులాల వారీగా ప్రస్తుతం ఉన్న వివరాలు, లెక్కలు ఇప్పుడు పనికి రావని చెబుతున్నారు. అందుకే బీసీ జనగణన జరగాల్సిందేనని కెసిఆర్ కూడా పట్టుబడుతున్నారు . ఇప్పుడు చంద్రబాబు కూడా మోడీ కి లేఖ రాయడంపై ఈ అంశం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే సందేహం తలెత్తుతోంది. ఎందుకంటే రాబోయే ఏడాదిన్నర లో ఎన్నికల హడావిడి మొదలైపోతుంది. ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మిగతా కులాల జనాభాకు ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాయి ప్రభుత్వాలు. ఇక మిగిలింది బీసీలే. ఓటు బ్యాంకు పరంగా ఎక్కువగా ఉన్నది కూడా వాళ్లే. అయితే న్యాయ, సాంకేతిక, పాలనా పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తుందని బిజెపి వాదిస్తోంది. ఒక కులం ఓ రాష్ట్రంలో  ఓసి అయితే అదే కులం మరో రాష్ట్రంలో బిసిగా ఉంది. ఇలా దేశ వ్యాప్తంగా వేల కులాలు ఉన్నాయి. అందుకే రాష్ట్రాలవారీగా బీసీ జనగణన చేసుకోవచ్చనేది బిజెపి వాదనగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: