సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించింది. ఆలయ విమానగోపురం తాపడానికి ఆరు కిలోల బంగారాన్ని బహుకరించనున్నట్టు సంస్థ డైెరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఆరు కిలోల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో సంబంధిత అధికారులకు అందజేస్తామని చెప్పారు.

యాదాద్రి ఆలయానికి విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇచ్చేందుకు తెలంగాణే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు ముందుకొస్తున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, చిన్నమండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ కేజీ బంగారం విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాను, కుటుంబ సభ్యులందరం కలిసి కేజీ బంగారాన్ని ఆలయానికి ఇస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన చెక్కును ఆలయ అధికారులకు ఇస్తామని తెలిపారు.

యాదాద్రి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం చేయించనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకు సుమారు 65కోట్ల రూపాయల విలువైన 125కిలోల బంగారం అవసరం పడనున్నట్టు చెప్పారు. తిరుమల గోపురం తయారు చేసిన నిపుణులను ఇప్పటికే సంప్రదించినట్టు చెప్పారు. అయితే స్వర్ణ గోపురం తయారీకి కావాల్సిన డబ్బు సేకరణలో రాష్ట్ర ప్రజలు భాగస్వాములు కావాలని కేసీఆర్ కోరారు. మొట్టమొదటి డోనర్ గా తాను కేజీ 16తులాల బంగారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం, మేడ్చల్ ప్రజలు కిలో బంగారం, మర్రి జనార్ధన్ రెడ్డి 2కిలోలు, కావేరీ సీడ్స్ కిలో బంగారం, సిద్ధిపేట తరఫున హరీశ్ రావు కిలో బంగారం, చినజీయర్ స్వామి పీఠం కిలో బంగారం, హెటిరో ఛైర్మన్ పార్ధసారథి 5కీలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.

మరోవైపు యాదాద్రి ఆలయ పున: ప్రారంభ తేదీ ఖరారైంది. 28మార్చి, 2022న ఆలయాన్ని మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంతో ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా మహా సుదర్శనయాగంతో సుమారు 5వేలమంది రుత్వికులు పాల్గొంటారని చెప్పారు. అయితే యాదాద్రి ఆలయ ప్రారంభానికి  త్రిదండి చినజీయర్ స్వామి ముహూర్తం పెట్టారు.ఆయన స్వయంగా రాసిన పత్రికను సీఎం కేసీఆర్.. లక్ష్మీనరసింహా స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు.













మరింత సమాచారం తెలుసుకోండి: