రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు వేయడంతో దిట్ట ఎవరూ అంటే... ఠక్కున చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం... 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. సమస్యను పరిష్కరించడంలో ఎంతటి చతురత చూపుతారో... అదే సమయంలో... సమస్యను తమకు అనుకూలంగా మార్చడంలో కూడా చంద్రబాబు ఎక్స్‌పర్ట్. ఇప్పటికి ఎన్నోసార్లు ఇదే విషయం రుజువైంది. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయ సిబ్బందికి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. అలాగే 36 గంటల పాటు నిరసన వ్యక్తం చేసేందుకు కూడా చంద్రబాబు సమాయత్తమయ్యారు.

ఇప్పుడు మరో మాష్టర్ స్కెచ్ చంద్రబాబు వేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానంతో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. 2009 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.... తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీపై మాత్రం అభిమానం అలాగే ఉంచుకున్నారు. అయితే తాజాగా టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరగడం... అలాగే హిందూపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడికి యత్నించడం కూడా ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇదే విషయంపై నందమూరి అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో పార్టీకి అండగా ఉండాలంటూ... జూనియర్ ఎన్టీఆర్‌తో చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ రాక కోసం పార్టీలో ఎంతో మంది నేతలు... ఎన్నో రోజులుగా గోల గోల చేస్తున్నారు కూడా. దీంతో ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారు. 36 గంటల పాటు నిర్వహించే దీక్షకు మద్దతు తెలిపే విషయంపై కూడా చంద్రబాబు, జూనియర్ మధ్య చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: