విద్యుత్ సంక్షోభం వ‌స్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ ఉత్ప‌త్తి పెరిగింద‌నే అంశం కాస్త ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇదే క్ర‌మంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కు త‌గ్గ‌ట్టుగా ఉత్ప‌త్తి దాదాపు స‌మాన స్థాయికి చేరుకుంద‌ని ఉన్నతాధికారులు వెల్ల‌డించారు. నిన్న (బుధ‌వారం) 203 మిలియ‌న్ యూనిట్లు విద్యుత్ డిమాండ్ ఉండ‌గా జెన్కో విద్యుత్ కేంద్రాల్లో 98 మిలియ‌న్ యూనిట్లు ఉత్ప‌త్తి చేశారు. 


ఇందులో థ‌ర్మ‌ల్ 76 మిలియ‌న్ యూనిట్లు, జ‌ల విద్యుత్ 3 మిలియ‌న్ యూనిట్లు ఉత్ప‌త్తి జ‌రిగింది. మ‌రో 12 మిలియ‌న్ యూనిట్ల‌ను బ‌హిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది ప్ర‌భుత్వం. ఇవ‌న్ని క‌లిసి కేంద్రం అందించే విద్యుత్ డిమాండ్‌కు త‌గిన‌ట్టుగా విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు.  కేంద్ర‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీపీసీతో కలుపుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉత్పాదన సామర్థ్యం 12,290 మెగావాట్ల థర్మల్ విద్యుత్ క‌ల‌దు.


అలాగే ఇంకా 1,820 మెగావాట్ల హైడల్ పవర్ కూడా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థాపించిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా మొత్తం సామర్థ్యం 7,217 మెగావాట్లు ఉంది. అందులో ప్రస్తుతం 20 శాతం మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. అధికారిక లెక్కల ఆధారంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 10వ తేదీ నుంచి 14 వరకు విద్యుత్‌ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) కంటే తక్కువగా ఉంది.


రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌న్నా ఎక్కువగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అక్టోబర్‌ 14న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  0.76 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉండగా మరుసటి రోజు నాటికి అది కూడా పోయి లోటు పూర్తిగా త‌గ్గిపోయి 0 గా ఉంది. రానున్న రోజుల్లోనూ రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు ఉండ‌వ‌ని ఇప్ప‌టికే విద్యుత్ శాఖ హామినిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: