ప్ర‌తిప‌క్షాన్ని అణిచి వేసిన ప్ర‌తిసారీ పాల‌క ప‌క్షాలు ఓడిపోతూనే ఉన్నాయి. అణిచివేత‌ల కార‌ణంగానే ప్ర‌జ‌ల్లో చెడ్డ పేరు వ‌స్తుంద న్న వాస్త‌వాన్ని గ్ర‌హించ‌లేక‌పోతున్నాయి. ముందు నుంచి ఈ ఆచారం ఉందో లేదో కానీ ఇటీవ‌ల కాలంలో ఈ ట్రెండు బాగానే సెట్ అవుతోంది. ఉద్య‌మాలు చేసుకునే వెసులుబాటు కానీ స్వేచ్ఛ కానీ విపక్ష పార్టీల‌కు ఇవ్వ‌నంత కాలం ప్ర‌జ‌లలో పాల‌క ప‌క్షం చుల‌క‌న భావం స్థిరం చేసుకుంటోంది. ఎలా అయినా స‌రే త‌మ త‌ర‌ఫున మాట్లాడే వారంటే ప్ర‌జ‌ల‌కు ఉండే ఓ ర‌కం సానుభూతే పాల‌క ప‌క్షం క‌ల‌వ‌రపాటుకు కార‌ణం. అప్పుడు జ‌గ‌న్ విష‌య‌మై అసెంబ్లీలో టీడీపీ న‌డుచుకున్న స‌ర‌ళే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మ‌ళ్లీ ఇప్పుడు చంద్ర‌బాబు వ‌య‌సుని కూడా చూడకుండా తిట్టిపోస్తున్న మంత్రుల‌పై ప్ర‌జాగ్ర‌హం త‌ప్ప‌దు. ఎవరు ఔన‌న్నా కాద‌న్నా ఆయ‌న అనుభ‌వజ్ఞుడైన పొలిటీషియ‌న్. ఆయ‌న‌కు ఇవ్వాల్సిన గౌర‌వం ఆయ‌న‌కు ఇచ్చాక‌నే ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మంచి మ‌న్న‌న‌లు అందుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు జ‌గ‌న్.


రాష్ట్రంలో ఏర్ప‌డ్డ ప‌రిణామాలు, త‌ద‌నంత‌ర ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉన్నా కూడా జ‌గ‌న్ కు మాత్రం కాస్త క‌ల‌వ‌ర‌పాటుగానే ఉన్నాయి. గ‌తంతో పోలిస్తే జ‌గ‌న్ గ్రాఫ్ త‌గ్గింది. ప‌థ‌కాల అమ‌లుతో పేరు తెచ్చుకుంటున్నామ‌ని జ‌గ‌న్ భావించినా కూడా అవేవీ నాలుగు ఓట్లు రాల్చ‌వు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఉద్యోగావ‌కాశాల వృద్ధి, న‌గ‌రాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ర‌హ‌దారుల సౌక‌ర్యం, ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌, అదేవిధంగా  రైతాంగాన్ని ఆదుకునే చ‌ర్య‌లు అన్నవి ఏ ప్ర‌భుత్వానికి అయినా ముఖ్య‌మ‌యిన విష‌యాలు. కానీ జ‌గ‌న్ మాత్రం వీటిపై దృష్టిసారించ‌డం లేదు. తాజాగా గంజాయి సాగు, ర‌వాణాపై నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీడీపీ డిమాండ్ చేయ‌డం, వీటి ప‌ర్య‌వ‌సానాల నేప‌థ్యంలోనే ప‌ట్టాభి ప్రెస్మీట్ పెట్ట‌డం, ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తిని అన‌రాని మాట‌లు అన‌డంతో వివాదం ముదిరింది. ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు పోటా పోటీగా దీక్ష‌లు చేసుకుంటున్నారు.


వైసీపీ జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేస్తుంటే, ప్ర‌భుత్వ ఉగ్ర‌వాదంపై పోరు పేరిట టీడీపీ దీక్ష‌లు చేప‌డుతోంది. ఇవి పైకి బాగానే ఉన్నా లోప‌ల మాత్రం వైసీపీ వ‌ర్గాలు కల‌వ‌రం చెందుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ కార్యాల‌యంపై జ‌గ‌న్ అభిమానుల రాళ్ల దాటి ఘ‌ట‌న‌లో చంద్రబాబు ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొందారు. ఇదే విధంగా చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష‌పై కూడా జ‌నం సానుకూలంగానే ఉన్నారు. తాము దాడి చేయ‌కుండా ఉంటే బాగుండు అన్న అర్థం ఒక‌టి వైసీపీ స‌భ్యుల్లో ధ్వ‌నిస్తోంది. అన‌వ‌స‌రంగా దాడి చేసి టీడీపీ ఇమేజ్ ను తామే పెంచామ‌న్న ధోర‌ణి ఒక‌టి పైకి క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: