హుజురాబాద్ లో జరిగేది మామూలు, సాదాసీదా ఎన్నికలా? కానేకాదు. ఆశకి, ఆరాటానికి, సానుభూతి, సంక్షేమానికి జరుగుతున్న పోరాటం ఇది. అందుకే విజయమో వీరస్వర్గమో అన్నట్లు బిజెపి, టిఆర్ఎస్ ప్రచారం లో దూసుకుపోతున్నాయి. ఎన్నికలకు ఇంకొన్ని రోజులే ఉండడంతో ప్రచారం స్పీడ్ పెంచాయి. ఇంటింటికి కొందరు, వీధుల్లోకి కొందరు, రోడ్డెక్కి మరికొందరు తమ అభ్యర్థిని గెలిపించాలని  వర్షాకాలంలోనూ చెమటలు కక్కుతున్నారు. టిఆర్ఎస్, బిజెపి ఈ స్థాయిలో కష్టపడుతుంటే కాంగ్రెస్ మాత్రం కూల్ బేబీ కూల్ అంటుంది. ఆ రెండు పార్టీలు హుజురాబాద్ లో ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాదులో  ఉంది. ఒకటి రెండు పెద్ద తలకాయలు తప్ప పెద్దగా కాంగ్రెస్ నేతలు కనిపించడం లేదు.

 హుజరాబాద్ లో హస్తం  పార్టీ పెద్దలెవరు కనిపించడం లేదు. కార్యకర్తల్లో ఉన్న టెన్షన్ కూడా నాయకుల్లో కనిపించడం లేదు. అయ్యా ప్రచారానికి ఎవరూ రావడం లేదు, రేవంత్ రెడ్డి నన్ను పట్టించుకోవడం లేదు, ఈ మాత్రం దానికి నన్నెందుకు పోటీలో నిలబెట్టారు, హుజరాబాద్ నడివీధిలో ఎందుకు ఒంటరిని చేశారు అని బాధగా, అసంతృప్తిగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి  దగ్గర బల్మూరి వెంకట్  మొరపెట్టుకున్నారట. అరే వెంకట్ బాయ్ 224 గంటల ప్రచారం చాలు నిన్ను గెలిపించేందుకు అని మాణిక్యం టాగూర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. యూత్ కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు తప్ప పెద్దగా నాయకులెవరూ కనిపించడం లేదు. పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మాత్రమే హుజురాబాద్ లో కనిపిస్తున్నారు. దీంతో వెంకట్ లో బెంగ మొదలైంది. స్టార్ కాంపెనర్ లు ఏమోగానీ తోకచుక్కలు కూడా కనిపించడం లేదు అక్కడ . జాతీయ నేతలు కూడా రంగంలోకి దిగుతారని అన్నారు  ఆ ప్రస్తావనే లేదు. ఓయూ జేఏసీ నేతలు వస్తారన్నారు వారెక్కిన బస్సు ఎక్కడ ఆగిందో తెలియదు. కాంగ్రెస్ తీరుతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి  . బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని టిఆర్ఎస్ శ్రేణులు పదే పదే విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. హుజరాబాద్ లో కాంగ్రెస్ ఎప్పుడూ గెలవలేదు ఇప్పుడు ఎడ్జ్ ఉందా అంటే అదీ లేదు. అలా అని యుద్ధంలో దిగాక వెనకడుగు వేస్తారా. ఇది రాబోయే రోజుల్లో పార్టీ మీద ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు జరగబోయేది ఒక్క నియోజకవర్గంలో ఉప ఎన్నిక అయిన ఆ ఇంపాక్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని ఇది గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ అడుగులు వేయాలని  పలువురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: