వాళ్లు మాటలు మీరారు, వీళ్ళు చేతలు మీరారు. వాళ్లు మాటల దాడి చేశారు, వీళ్లు భౌతిక దాడి చేశారు. వాళ్లు బందుకు పిలుపునిచ్చారు వీళ్ళు నిరసనలకు దిగారు. ఎవరు నోరు వారిది ఎవరి చేతి కర్రలు వారివి ఎవరిష్టం వారిది ఇది ఏపీలో రాజకీయ పరిస్థితి. ప్రజలనేవారు కొందరు ఉంటారని , పాలించే వైసీపీకి ప్రతిపక్ష టీడీపీ కి అసలు గుర్తుందా. పట్టాభి ఇలా మాట్లాడాడో లేదో వైసిపి వాళ్ళు అలా రెచ్చిపోయారు. పార్టీ ఆఫీసు మీద దాడికి దిగారు. మాటలకు మాట కాదు, మాటకు చేతలే సమాధానమన్నట్లుగా దాడులకు పాల్పడ్డారు. టిడిపి ఆఫీస్ లో జరిగిన సంఘటనలు చూస్తే  అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న అనుమానాలు కలిగించాయి. వాళ్లు వీళ్లు అని కాదు రెండు పార్టీల వాళ్లు అలానే  ఉన్నారు. శాంతిభద్రతలు మూటా ముల్లె సర్దుకొని బంగాళాఖాతంలో దూకేసి నట్లుంది పరిస్థితి.

ఒక్క క్షణం ఆలోచించి  అడుగు ముందుకు వేస్తే ఇలా అబాసుపాలు కావలసిన అవసరం రెండు పార్టీలకు ఉండేది కాదు. ఇలాంటి మాటలు మాట్లాడటం లో పట్టాభి మొదటి వ్యక్తి కాదు. వైసీపీలో మంత్రుల నుంచి టిడిపిలో గల్లీ లీడర్ వరకు అందరూ మాట్లాడిన వారే. ఏపీలో రాజకీయాలు ఎలా మారాయంటే  మాటకి మాట, దెబ్బకి దెబ్బ తీయకపోతే వాడిని చేతకానీ వాడిగా జతకట్టే పరిస్థితి వచ్చింది. ఇక ఏపీ మరో తమిళనాడుల మారుతుందన్న ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతుంది. ఇలా దాడులు చేసిన వైసీపీ ని నడిరోడ్డుపై నిలబెట్టి వారి దాడుల సంస్కృతి జనాలకు చూపించాలన్నదే టీడీపీ ప్లాన్. తెలంగాణలోనూ ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద నోరుజారిన నేతలున్నారు కానీ అక్కడ పార్టీ ఆఫీసుల మీద వ్యక్తుల మీద భౌతిక దాడుల సంస్కృతి అనుకున్నట్లుగా ఇప్పటికైతే కనిపించడం లేదు. ఇప్పుడు చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తానంటున్నారు. పంచాయతీ ని కేంద్రం ముందు పెడతానంటున్నారు. శనివారం హోంమంత్రి అమిత్ షాను కలుస్తాను, వైసిపి సంగతేంటో తేలుస్తాను అంటున్నారు. ఇదే అమిత్ షా తిరుమలకు వస్తే అలిపిరిలో తెలుగు తమ్ముళ్ళు కర్రలు రాళ్లతో దాడి చేయలేదా అని వైసిపి నేతలు అంటున్నారు. ఏదేమైనా వీరిద్దరి  మాటల దాడులు,భౌతికదాడులు దేశ రాజధానికి చేరుకోబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: