ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా మారాయి. ఇంకా చెప్పాలంటే... దాడులు, ప్రతి దాడులు, కేసులు, అరెస్టులు, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, బంద్‌లతో అట్టుడుకుతోంది. రాజకీయ నేతలకు మాత్రం కళకళలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తొలి ఏడాది పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మొగ్గు చూపారు. తొలి ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు అమలు చేశామని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇదే సమయంలో దూకుడు కూడా ప్రదర్శించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇబ్బందులకు గురి చేశారు కూడా. ఇప్పుడు ఎన్నికలకు సరిగ్గా రెండున్నర ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలపై వైసీపీ నేతలు ఇప్పటి నుంచి దృష్టి పెట్టారు. అందుకే గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తున్నారు వైసీపీ నేతలు.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలు ఏసుకుంటున్నారు. దాదాపు నెలన్నర కాలంగా వైసీపీలో కొంతమంది సైలెంట్‌గా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం... మంత్రివర్గంలో మార్పులు తప్పవనే సూచనలు. తమను తొలగిస్తారని ప్రస్తుత మంత్రుల్లో అసహనం ఉంది. అలాగే మంత్రివర్గంలో తనకు అవకాశం వస్తుందా అని సీనియర్లు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీంతో... తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి వరకు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు వైసీపీ నేతలు. అయితే తాజాగా పట్టాభి ఘాటుగా వ్యాఖ్యానించడంతో... ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేశారు. అంతటితో ఊరుకోకుండా... జనాగ్రహ దీక్ష పేరుతో చంద్రబాబు నిరసనకు కౌంటర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు కూడా. ఇందుకు ప్రధాన కారణంగా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అందినే ఆదేశాలే అని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బ కొట్టేందుకు వైసీపీ మెగా ప్లాన్ వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: