ఆహార భద్రత విషయంలో భారత్ పనితీరు సరిగా లేదని ప్రపంచ ఆహార భద్రత సూచిక -2021 తాజా నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది 113 దేశాలకు ర్యాంకింగ్స్ విడుదల చేయగా, భారత్ కు 71వ స్థానం దక్కింది. అయితే చైనా 34వ స్థానంతో భారత్ కంటే చాలా ముందుంది. పలు అంశాల్లో పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్,బంగ్లాదేశ్ దేశాలు భారత్ కన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. భారత్ కంటే పాకిస్తాన్-శ్రీలంక దేశాల్లో తక్కువ ఖర్చుతో ఆహారం అందుబాటులో ఉందని, గడిచిన పదేళ్లలో ఆహార భద్రత విషయంలో భారత్ పనితీరు కేవలం 2.7 పాయింట్లు మాత్రమే మెరుగుపడిందని జిఎఫ్ఎస్ ఇండెక్స్ తెలిపింది. లండన్ కు చెందిన ఎకనామిస్ట్ ఇంపాక్ట్, అమెరికాకు చెందిన కోర్టెవా అగ్రి సైన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. కొనుగోలు శక్తి, అందుబాటులో ఉండే ఆహారం, నాణ్యత,భద్రత, సహజ వనరులు మొదలైన 58 అంశాల ఆధారంగా ఈ సూచిని తయారు చేశారు.

 గడచిన పదేళ్లలో భారత్ పనితీరు గురించి కీలక విషయాలు ఇందులో ప్రస్తావించారు. ఆహార భద్రత విషయంలో 2012 నుంచి 2021 మధ్య కాలంలో భారత్ కు కేవలం 2.7 పాయింట్లు పెరిగాయి. ఇదే కాలంలో పాకిస్తాన్ 9 పాయింట్లు, నేపాల్ 7 పాయింట్లు, బంగ్లాదేశ్ 4.7 పాయింట్లు, చైనా 9.6 పాయింట్లు పెంచుకోగలిగాయని నివేదిక పేర్కొంది. తక్కువ ఖర్చుతో ఆహారం కొనుగోలు అనే అంశంలో భారత్ కు 50.2 పాయింట్లు, పాకిస్తాన్ కు 52.6 పాయింట్లు, శ్రీలంకకు 62.9 పాయింట్లు దక్కాయి. ఈ ఏడాది విడుదలైన జిఎఫ్ఎస్ ఇండెక్స్ లో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫీన్లండ్, స్విజర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, జపాన్,ఫ్రాన్స్, అమెరికా టాప్-10 లో నిలిచాయి. ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన  ప్రజలందరికీ ఆహార భద్రత అనేదాన్ని 2030 లోగా భారత్ సాధించాల్సి ఉంది. ఇందుకోసం గాను ప్రభుత్వాలు తమవైన సంక్షేమ పథకాలు, విధానాలు తీసుకురావాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో జిఎఫ్ఎస్ లాంటి సూచికలు విధాన రూపకల్పనకు దోహదపడతాయి. ఆహార భద్రతకు సంబంధించి 58 అంశాల్లో సగటున భారత్ కు 57.2 పాయింట్లు వచ్చాయి. ఏ ఏ అంశాలు దేశంలో ఆహార అభద్రత కు దారితీస్తాయన్నది అంచనా వేసుకోవడానికి నివేదిక ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019 తర్వాత ధరల పెరుగుదల కారణంగా ఆహార భద్రత లో 70 దేశాల ర్యాంకింగ్ పడిపోయాయని నివేదిక తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: