క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టిన తర్వాత కూడా  ఔట్ అవ్వకుండా పరుగుల వరద పారిస్తున్న ఆట గాడిలా మోడీ పెట్రోలు,డీజిల్ ధరను లీటర్ కు ₹100 దాటాక కూడా ఆగకుండా  పెంచుకుంటూ పోతున్నారు. మనం కేరింతలు కొట్టే వీక్షకుల స్థానాల్లో లేము. బౌలింగ్ చేసే స్థానాల్లో ఉన్నాం. స్కోరు పెరుగుతోంది మోడీకి. పెరిగిపోతున్న ధరలు భరించలేక చెమటలు కక్కుతున్నది మనం. 2014లో మోడీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ ధరలు ఏకంగా 79 శాతం పెరిగాయి. డీజిల్ ధరలు మరీ అన్యాయంగా 101% పెరిగిపోయాయి. గత ఏడాది కాలంలోనే పెట్రోలు 26 శాతం డీజిల్ 31 శాతం పెరిగిపోయాయి. వంట గ్యాస్ ధర ఒక్క ఏడాదిలో 300 రూపాయలకు పైగా పెరిగింది.

కరోణ మహమ్మారి అత్యధిక ప్రజల జీవనోపాధిని, ఆదాయాలను దెబ్బతీసిన ఈ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వారి మీద మోయలేని భారాలను వడ్డించడం కేంద్ర ప్రభుత్వపు క్రూరమైన మైండ్ సెట్ ను సూచిస్తుంది. ఒకవైపు 10 కోట్ల టన్నులకు పైగా ఆహారధాన్యాల నిల్వలను ఉంచుకొని ఇంకొక వైపు భారతదేశాన్ని ప్రజల కడుపులను నింపలేని ఆకలి రాజ్యాల లిస్టులో అగ్రస్థానంలో నిలిచిన ఘనత మోడీకే దక్కుతుంది. పెట్రో ఉత్పత్తుల ధరలను గతంలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించేది. తర్వాత నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా ఆయా కంపెనీల కే విడిచిపెట్టింది. మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను బట్టి ఎప్పటికప్పుడు ధరలను నిర్ణయిస్తారని అప్పుడు చెప్పింది ప్రభుత్వం. కానీ ముడిచమురు ధర తగ్గిన కాలంలో సైతం ఇక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి పోతూ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ఉత్పత్తుల మీద  విధించే ఎక్సైజ్ పన్ను ఎప్పుడు పడితే అప్పుడు పెంచుకుంటూ పోతుంది.

పెట్రో ఉత్పత్తుల మీద పన్నును ప్రధాన ఆదాయ వనరుగా చేయడమే దీనికి కారణం. కరోనా కాలంలో సంక్షేమ కార్యక్రమాలకు గాని, ప్రజారోగ్య పరిరక్షణకు గాని, ఉద్యోగాలు నియామకాలకు గాని, ఉపాధి హామీ పథకానికి గాని ఖర్చు చేసి ఉంటే ఈ సొమ్ము ఏదో రూపంలో ప్రజలకు ఉపయోగపడి ఉండేది. కానీ ఆ విధంగా చేయడం లేదు కార్పొరేట్ల కే సమర్పించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: