దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. యూపీలో అధికారం సాధిస్తే చాలు... కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం దక్కుతుందనేది అన్ని రాజకీయ పార్టీ నేతల నమ్మకం. అందుకే... దాదాపు రెండేళ్ల ముందు నుంచే... ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా యూపీలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో భారీ స్కెచ్ వేస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ఎన్నికల బాధ్యతను పూర్తిగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించారు. యూపీలో స్వయంగా రంగంలోకి దిగిన ప్రియాంక... ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా... యోగీ ఆదిత్యా నాథ్ ప్రభుత్వంపై ధ్వజం ఎత్తుతోంది. లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులు మృతి చెందిన విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కూడా. ఇప్పుడు తాజాగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో యూపీ యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్లాన్ వేసింది. యువతపై వరాల జల్లు కురిపించింది.

ఎన్నికల్లో గెలుపు కోసం అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. సాధారణంగా యూపీలో మహిళల ఓటు ఎవరికి ఎక్కువగా పడితే... ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకే అన్ని పార్టీలు మహిళా ఓటు బ్యాంకుపై కన్నేశాయి. ఇప్పటికే మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరి కొన్ని వరాలు కురిపించింది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి... అధికారంలోకి వస్తే... ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లను ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన  యువతుల కోసం కూడా ఓ మెగా ఆఫర్ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి స్కూటీ అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్వయంగా ప్రకటించారు. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రకటిస్తామన్నారు. పార్టీ సమావేశంలోనే ఈ హామీలపై కీలకంగా చర్చించామన్నారు. విద్యార్థునుల భద్రతపై తొలి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు... భద్రతకు పెద్ద పీట వేస్తామని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: