టీడీపీ అధికార ప్ర‌తినిధి  పట్టాభిరామ్‌ను గురువారం విజ‌య‌వాడ‌ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణ చేప‌ట్టి కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాద‌న‌లు వినిపించారు.  పట్టాభి తరచూ నేరాలకు పాల్పడుతున్నాడని,  ఇప్పటికే పట్టాభిపై 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.  ప్రస్తుతం కూడ ప‌లు కేసుల్లో బెయిల్‌పై ఉన్నాడని వివ‌రించారు. బెయిల్‌పై ఉన్నప్పటికీ పట్టాభి బెయిల్‌ ఆంక్షలను పాటించడంలేదని కోర్టుకు తెలిపారు.

ప‌ట్టాబిని అరెస్టు చేయ‌క‌పోతే అత‌ని వ్యాఖ్య‌ల ద్వారా ప్ర‌జ‌ల‌ను మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురిచేస్తాడు. నిందితుడిని అరెస్టు చేయ‌క‌పోతే ప్ర‌జ‌ల‌ను బెదిరింపుల‌కు గురిచేసే అవ‌కాశం ఉన్న‌ది. ఫిర్యాదు దారుని, ఇత‌రుల‌ను బెదిరించి ప్ర‌భావితం చేసే ఛాన్స్ ఉన్నందున అరెస్ట్ చేసిన‌ట్టు వివ‌రించారు. రాజ‌కీయ మైలేజీని పొందాల‌నే ఉద్దేశంతో ప‌లు నేరాల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. ప్ర‌జా ప్ర‌శాంత‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మే కాకుండా కులాల‌ను, మ‌తాల‌ను, వ‌ర్గాల‌ను ప్రేరేపించే అవ‌కాశం పొంచి ఉంది. రాజ్యాంగ ఉల్లంఘ‌న చేస్తూ భ‌య‌పెట్టే భాష‌ను మ‌రింత‌గా ఉప‌యోగించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర పోలీసుల‌కు చెడ్డ‌పేరు తీసుకురావాల‌నే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య‌లు చేసినట్టు ప్రాథ‌మికంగా వెల్ల‌డి అయింద‌ని వివ‌రించారు.

వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి ప‌ట్టాబికి బెయిల్ ఇవ్వ‌డం క‌న్నా జ్యుడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించ‌డ‌మే స‌రైన చ‌ర్య అని ప్ర‌భుత్వం త‌రుపు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. ప్ర‌స్తుతం ప‌ట్టాభిని మ‌చిలీప‌ట్నం జైలుకు పోలీసులు త‌ర‌లించారు. సీఎం జ‌గ‌న్ పై చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లకు విజ‌య‌వాడ గ‌వ‌ర్న‌ర్‌పేట పోలీసులు బుధ‌వారం రాత్రి ప‌ట్టాభిని అరెస్ట్ చేసిన విష‌యం విధిత‌మే. ప‌ట్టాభి వ్యాఖ్య‌ల‌తో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. పోలీస్ అధికారిపై హ‌త్యాయ‌త్నం చేసే స్థాయికి వెళ్లింది. వీటిని దృష్టిలో ఉంచుకొని నిందితుడిని అరెస్టు చేసిన‌ట్టు ఆయ‌న వాద‌న‌లు వినిపించారు.  ప‌ట్టాభి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్‌పేట పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌డంతోనే సెక్ష‌న్ 153 (ఏ), 505 (2), 341, 143, 290, 188, 171హెచ్‌, 149 ఐపీసీ, 190 ఎంవీయాక్ట్‌, 286, 120 (బీ) కింద కేసు న‌మోదు అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: