ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిజానికి ఇపుడు ఎన్నికలు అసలు లేవు. ముఖ్యమంత్రిగా జగన్ సగం పాలన పూర్తి చేశారు. ఇంకా రెండున్నరేళ్ళ పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి ఇంతలో ఎందుకీ తొందర. ముందే ఎందుకీ రాజకీయ ఆర్భాటం, ఎందుకీ హడావుడి అంటే అదే రాజకీయం అని చెప్పుకోవాలేమో.

జగన్ మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ టీడీపీ నేత పట్టాభి మీడియా మీటింగ్ పెట్టారన్నది వైసీపీ అభియోగం. టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ క్యాడర్ దాడి చేశారని టీడీపీ ఆరోపణ. నిజానికి ఈ రెండు ఘటనలూ కూడా ఏపీలో పొలిటికల్ హీట్ ని ఒక్కసారిగా పెంచేశాయి. అయితే ఈ విషయంలో ఎవరూ తక్కువ తినలేదు అన్నట్లుగా కధ సాగుతోంది. టీడీపీ బంద్ పిలుపు ఇచ్చింది. ఇపుడు చంద్రబాబు దీక్షలు చేపట్టారు.

కౌంటర్ గా వైసీపీ నుంచి కూడా నిరసనలు సాగుతున్నాయి. రెండు వైపులా నువ్వా నేనా అన్నట్లుగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపధ్యమంతా పొలిటికల్ మైలేజ్ కోసమే అన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరి మైలేజ్ ఎంత అన్న చర్చకు వచ్చినపుడు సమాధానం మాత్రం నిరాశగానే ఉంటుంది. ఇందులో ప్రజా సమస్య ఏముంది. ప్రజలకు పనికి వచ్చే విషయాలు ఏమున్నాయి. జనాలు ఎందుకు రియాక్ట్ అవుతారు అన్న ప్రశ్నలూ వస్తున్నాయి.

వైసీపీ టీడీపీల మధ్య మాటల దాడి మొదటి నుంచి ఉన్నదే. అది ఈ రోజుకు పీక్స్ కి చేరింది. ఇపుడు శృతి మించి రాగాన పడుతోంది. ఇక రాష్టపతి పాలన పెట్టాలి అని టీడీపీ అంటే ఏకంగా టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసీపీ కోరుతోంది. రెండూ కూడా అసమంజసమైన డిమాండ్లే. మొత్తానికి ఏపీలో రాజకీయం రాజుకుంది. అది ఎటు వైపు వెళ్లినా మళ్ళినా జనాలతో మాత్రం కనెక్ట్ కావడం లేదు అన్నదే పచ్చి నిజం అంటున్నాయి విశ్లేషణలు.

మరింత సమాచారం తెలుసుకోండి: