ఏపీలో జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడనుందా..? అసలు అనర్హత వేటు ఎందుకు పడబోతోంది..? ఆయన చేసిన తప్పేంటి..? ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.. రాజోలులో జనసేన తరపున అభ్యర్థిగా పోటీచేసిన రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే జనసేన తరపున గెలిచినా.. కొద్దిరోజులకే వైసీపీ పంచన చేరారు. సీఎం జగన్ ను ప్రశంసిస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే విమర్శలు చేశారు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. అయితే కొద్దిరోజులకు జనసేన కార్యకర్తలు కూడా రాపాకను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఆయనను పట్టించుకోకుండా వదిలేశారు.

అయితే తాజాగా రాపాక వరప్రసాద్ మళ్ళీ వార్తల్లోకెక్కారు. వైసీపీ నేతలు చేస్తున్న జనాగ్రహ దీక్షల్లో ఆయన నేరుగా పాల్గొన్నారు. వైసీపీ కండువా కప్పుకొని మరీ స్లోగన్లు ఇచ్చారు. టీడీపీపై విమర్శలు చేశారు. అయితే ఆయన ఇప్పుడిలా వైసీపీ కండువా కప్పుకోవడం విమర్శలకు తావిస్తోంది. వరప్రసాద్ ఇప్పటివరకూ వైసీపీలో చేరలేదు. అధికారికంగా పార్టీ మారనూలేదు. అయితే పార్టీ మారకపోయినా జగన్ కు మద్దతు ప్రకటించారు. వైసీపీలో ఎమ్మెల్యేల మాదిరిగానే పనిచేస్తున్నారు. అయితే పార్టీ మారకుండా, ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటే.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో రాపాకపై అనర్హత వేటు పడుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రాపాక చేసిన ఈ చిన్నతప్పు కారణంగా, ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టయింది. గతంలోనూ పార్టీ మారితే అనర్హత వేటు వేస్తామని సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఈ నిబంధన కారణంగానే ఆయనకు ఇప్పటివరకూ వైసీపీ కండువా కప్పలేదు. అధికారికంగా పార్టీలోకి తీసుకోనూలేదు. రాపాక అత్యుత్సాహంతో చేసిన ఈ పని, ఆయనకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టింది. రాపాక వైసీపీ కండువా కప్పుకొని దీక్షలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తమను దెబ్బకొట్టిన రాపాకపై ప్రతీకారం తీర్చుకుందుకు సిద్ధమవుతున్నారు. అధికారికంగా పార్టీ మారకుండా ఇలా చేసినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కండువా మార్చినందుకే అనర్హత వేటు వేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: