ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే... అన్ని టీవీ ఛానళ్లు కూడా ఏపీ పాలిటిక్స్ పైనే ఫోకస్ పెట్టాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు జోరుగా సాగుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధ పట్టాభి... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అయితే.... ఓ పెద్ద దుమారమే రేపాయి. ఆగ్రహించిన వైసీపీ నేతలు ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేశాయి. దీంతో అరెస్టులు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు... అబ్బో... పరిస్థితి అంతా మారిపోయింది. చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష చేపడితే.... వైసీపీ నేతలు రెండు రోజుల పాటు జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం... డీజీపీపై టీడీపీ నేతల ఆరోపణలు.. ఇందుకు పోలీసు బాస్ కౌంటర్ ఇవ్వడం... అన్ని చకచకా జరిగిపోయాయి. ప్రతి విషయానికి బదులు ఉంటుందని ఒకరిపై ఒకరు సవాల్ చేసుకుంటున్నారు కూడా.

అయితే ఈ గోలలో పడిన ప్రధాన పార్టీలు.... అసలు విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరగనుంది. నవంబర్ ఒకటవ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండగా... వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్యకే వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం పోటీ చేసి తీరుతామంది. పార్టీ తరఫున ఓ అభ్యర్థిని కూడా బరిలో నిలిపింది. కానీ అతని గెలుపు కోసం ఏ మాత్రం కాషాయ పార్టీ నేతలు ప్రయత్నించటం లేదు. ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ బద్వేల్‌లో అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే నామినేషన్ దాఖలు చేసింది తప్ప.... అభ్యర్థి పేరు కూడా సరిగ్గా తెలియని పరిస్థితి. గెలుపు ధీమాతో ఉన్న వైసీపీ కూడా... తమ అభ్యర్థి తరఫున పెద్దగా ప్రచారం నిర్వహించటం లేదు. ఒకరిద్దరు జిల్లా నేతలు మినహా... బద్వేల్‌లో నేతల ప్రచారం కనిపించటం లేదు. తప్పదన్నట్లుగా కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం రెండు రోజులకు ఓ సారి బద్వేల్‌లో పర్యటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: