ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఘాటుగా తయారయ్యాయి. రెండు రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులు... ఫిర్యాదులు, అరెస్టులు, ధర్నాలు,  ఆందోళనలు.... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు దీక్ష చేపట్టారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ కూడా జనాగ్రహ దీక్షలు చేస్తోంది. ఇక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరు అయితే బాంబులేస్తాం అనేస్తున్నారు. మరొకరేమో కాసేపు కళ్లు మూసుకోండి... మేము ఏమిటో చూపిస్తామంటున్నారు. నీ సంగతి తేలుస్తాం... ప్రతి దానికి లెక్క చెబుతామంటూ ఒకరిపై ఒకరు వార్నింగ్ ఇస్తున్నారు కూడా. అయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కూడా.... కొంత మంది నేతలు మాత్రం కనీసం స్పందించక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అనంత నేతల తీరు కూడా స్పెషల్ గానే ఉంటుంది. వీరిలో జేసీ సోదరుల తీరు మరింత ప్రత్యేకంగా ఉంటుంది. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతలు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు వైసీపీ ఖాతాలో చేరినప్పటికీ.... తాడిపత్రి ఒక్కటే టీడీపీ దక్కించుకుంది. ఇప్పటికే జేసీ సోదరుల దూకుడు కారణంగా ఎన్నోసార్లు కేసులు, దాడులు కూడా జరిగాయి. ప్రతి దానికి లెక్క చెప్తాం అని జేసీ సోదరులు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. కానీ... ఇప్పుడు కేంద్ర కార్యాలయంపై దాడి జరిగితే... జేసీ సోదరులు కనీసం స్పందించటం లేదు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకిపోతుంటే... జేసీ సోదరులు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీ నేతలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జిల్లాలోని అన్ని పార్టీ కార్యాలయాలపై దాడి జరిగినా కూడా.... జేసీ బ్రదర్స్ ఎక్కడా కనిపించలేదు. అసలు ఈ బ్రదర్స్ ఎక్కడికి వెళ్లారు... ఏమయ్యారు అని అంతా ఆశ్చర్యపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: