దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులు నిప్పులు చెరుగుతున్నారు. వ‌చ్చేది ఇంత పోయేది అంత‌! అన్న‌ట్టుగా పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని.. ప్ర‌జ‌లు నెత్తీ నోరూ.. బాదుకుంటున్నారు. పెట్రోల్ ధ‌ర‌ల పుణ్య‌మా అని.. దేశంలో నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు.. స‌హా.. అన్ని ధ‌ర‌లు మండిపోతున్నాయి. అయితే.. ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి, బీజేపీ సీనియ్ నాయ‌కుడు  ఉపేంద్ర తివారీ వింతగా స్పందించారు. అస‌లు ప్ర‌జ‌లంటే ల‌క్ష్య‌మే లేద‌న్న‌ట్టుగా ఆయ‌న కామెంట్లు చేశారు. దీంతో ఇప్పుడు ప్ర‌జ‌లు మ‌రింత‌గా మండిప‌డుతున్నారు.

'ఇంధన ధరల పెంపు విషయానికొస్తే అసలు 95 శాతం మంది భారతీయులకు పెట్రోలే అవసరం లేదు. కొద్దిమంది మాత్రమే కార్లు వినియోగిస్తున్నారు,' అని బీజేపీ నేత‌, మంత్రి వ‌ర్యులు వ్యాఖ్యానించారు. '2014కు ముందు, ప్రస్తుత ఇంధన ధరలను పోల్చుతున్నారు. కానీ.. మోడీ ప్రభుత్వం వచ్చాక పౌరుల తలసరి ఆదాయం కూడా రెండింతలయింది కదా!' అని పేర్కొనడం గమనార్హం. అంటే ప్ర‌జ‌ల ఆదాయం పెరిగింది కాబ‌ట్టి.. మేం పెట్రోల్ ధ‌ర‌లు పెంచుతున్నాం.. త‌ప్పేముంది.. అని ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వేరే ఏ సమస్య లేనందునే దీనిపై రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ‌డం కొస‌మెరుపు.

'ప్రభుత్వం 100 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత డోసులు ఇచ్చింది. కొవిడ్‌ చికిత్స అందించింది. ఇంటింటికీ మందులు పంపిణీ చేస్తోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర రంగాల్లో ఉచిత సేవలు అందిస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ధరలు స్వల్ప మొత్తంలో మాత్రమే పెరిగాయ'ని తివారీ అన్నారు. తలసరి ఆదాయంతో పోల్చినట్లయితే.. ఇంధన ధరలు చాలా తక్కువేనని సమాధానం ఇచ్చారు. ప్ర‌స్త‌తం మంత్రిపై తీవ్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ప‌నిలో ప‌నిగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా త‌ఢాకా చూపిస్తాం అంటున్నారు.

యూపీలో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో పెరిగిన అస‌హ‌నాన్ని త‌గ్గించేందుకు బీజేపీ పాల‌కులు త‌లకిందులు ప‌డుతున్నారు. ఇప్పుడు మంత్రి వ్యాఖ్య‌లు మ‌రింత మంట పెట్ట‌డంతో ఆయ‌న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి. ఇక‌, గతంలోనూ బీజేపీకి చెందిన మంత్రులు, నాయకులు పెట్రోల్‌ ధరల పెరుగుదలపై ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవల పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి సైతం.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: