ప్రపంచంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ యుద్ధాల తీవ్రత వేరే లెవెల్ లో ఉంటుంది అనుకుంటున్న నిపుణుల అంచనాను ఆయా దేశాలు తారుమారు చేస్తున్నాయి. మనం బ్రతికితే చాలు అనే స్థాయికి ఆలోచనలు ఆయా దేశాలకు వస్తాయనే అంచనా వాళ్ళు వేయలేకపోయి ఉండవచ్చు. గతంలో యుద్దాలు అంటే యుదురుబొదురుగా వచ్చి, బాహుబలం తోనో లేక ఆయుధాలతోనే తేల్చుకునే వారు. కానీ ఇటీవల తెలివితేటలు ఎక్కువై, యుద్ధ వ్యూహాలలో ఘోరంగా మార్పులు చోటుచేసుకున్నాయి. వాటి పరియవసానమే ఇటీవల ప్రపంచం చూసిన వాణిజ్య యుద్ధం. అక్కడ నుండి మొదలైన విషయం వైరస్ వరకు వెళ్ళింది. అంతటితో ఆగకుండా, మానవత్వం చూపాల్సిన క్షణాలలో ఒకదేశంపై విరుచుకుపడ్డ తాలిబన్ లు వాళ్లకు సాయం చేసిన మూర్ఖులను చూస్తేనే మనిషి తన స్వప్రయోజనాల కోసం ఎంత దిగజారిపోతున్నాడో చెప్పవచ్చు.

ఈ రోజులలో కూడా ఇంకా యుద్దాలు అనే మాట ఎత్తటమే మానుకోవాల్సి స్థితికి ఎదగాల్సిన మనిషి రానురాను అధికార దాహం చేత దిగజారిపోతున్నాడు. దానికోసం కూర్చున్న కొమ్మనే నరుక్కోడానికి కూడా వెనకాడనంత తెలివిగా ఆలోచనలు అమలు చేస్తున్నాడు. ఎక్కడ సున్నిత సమస్యలు ఉన్నా వాటిని ఎక్కువ చేసి లబ్ది పొందాలని చేస్తున్నాడు. ఇలా ఒకటేమిటి మనిషి స్వార్థం కోసం చేయని పని లేదు. అందులో ఎంతమంది నలిగిపోయింది పరవాలేదు అనుకుంటూ తనను తాను నీచపరుచుకుంటున్నాడు. ప్రపంచంలో దేశాలు అన్నీ స్వేచ్ఛ, సమానత్వం, శాంతి వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నప్పుడల్లా ఇలాంటి మూర్ఖులు వాటిని ముందుకు సాగకుండా అడ్డుకుంటూనే ఉన్నారు.  

ఉమ్మడిగా అందరు ముందుకు పోవాలి అనుకునేటప్పుడు ఒకరి బలహీనత మరొకరు బలం అయినప్పుడే అనుకున్నది సాధించవచ్చు, అలా కాదని ఎదుటివారి బలహీనతను అడ్డుపెట్టుకొని వాళ్ళని ఆడించాలి అనే ఆలోచన వస్తే, అంతకంటే దిగజారుడు ఆలోచన లేదనే చెప్పాలి. ఉగ్రమూకలు అంటేనే మూర్ఖులు, వాళ్లకు చెప్పినా అర్ధం కాదు. మరి ఆయా దేశాలకు ఏమైంది, అందరు కలిసి శాంతి, పేదరిక నిర్ములన లాంటివి చేయడానికి అడ్డేముంది, అయినా ఎక్కడో ఏదో అహం, దానిని మాత్రం వదలరు. అది వదిలితేనే ప్రపంచంతో ఉగ్రమూకలు కులం, మతం లాంటి వాటిని అడ్డు పెట్టుకొని ఆడించకుండా ఉంటారు. మనం ఒక్కొక్కరు బలహీనులమేమో, అందరం కలిస్తే ఎవరు సరిపోతారు, ఈ ఉగ్రమూకలు తట్టుకోగలవా.. ఈ మాత్రం ఆలోచన రాదా..! అంతమాత్రాన ఇన్ని దేశాలు ఎందుకు, అందుకోసం ఇంతమంది అధినేతలు ఎందుకు..! ప్రపంచంలో సమస్యలు ఇన్ని దేశాలు కలిసి తీర్చుకోగలవు, అది సాధ్యం, దానిని తుచ్ఛమైన అహానికి బలిచేయకండి. మరొకరిని మధ్యలో రానీయకండి. తాజా బంగ్లాదేశ్ ఘటన నుండి ప్రపంచం తీవ్రవాద వ్యూహాన్ని గ్రహించాలి, భారత్ అర్ధం చేసుకుంది అందుకే సంయమనంతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: