విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అలక పాన్పు వీడారా? ఆయన మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలను ఇందుకు నిదర్శనంగా ఉదహరిస్తున్నాయి. అధికార వైసీపీ దాడులను నిరసగా ధర్మదీక్షకు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్టీ ఎంపీ కేశినేని నాని ఏకాంతంగా భేటీ అయ్యారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. కొట్టుకోవాలనుకుంటే కొట్టుకుందాం.. అందుకు మేం సిద్ధంగా ఉన్నామని వైసీపీకి సవాల్‌ విసిరారు. ఈ వరుస పరిణామాలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయంగా ఆసక్తి రేపాయి.

నిజానికి టీడీపీ ఎంపీ కేశినేని నాని కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తన వర్గానికి పార్టీలో ప్రాధాన్యత లేదన్న కారణంతో ఆయన అలక బూనారని పార్టీ వర్గాల్లో టాక్. దీనికితోడు ఇటీవల కేశినేని భవన్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో చంద్రబాబు, ఏడు నియోజకవర్గాల ముఖ్య నేతల ఫోటోలను తొలగించి.. ఆ స్థానంలో రతన్‌ టాటాతో కేశినేని నాని కలిసి ఉన్న ఫోటోలు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే కేశినేని నాని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం తెలుగునాట హాట్ టాపిక్‌ అయ్యింది. అయితే అప్పుడు
విజయవాడ టీడీపీ నేత ఫతావుల్లా... కేశినేని భవన్‌లో ఒక ఛాంబర్‌లో కేవలం చంద్రబాబు ఫొటోను మాత్రమే మార్చారనీ, కార్యాలయం వెలుపల, లోపల తక్కిన గదులలోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు ఫొటోలు యథావిధిగా ఉంచారని స్పష్టత ఇచ్చారు. దీంతో కేశినేని నాని వ్యవహారంపై గందరగోళానికి తెరపడినట్లు అయింది.

ఇక ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, అలాగే పలు జిల్లాల్లోని టీడీపీ ఆఫీసులపై, అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి, ఆయన అరెస్ట్‌ తదితర పరిణామాలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ దాడులకు నిరసనగా ధర్మదీక్షకు దిగిన చంద్రబాబు వద్దకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే కేశినేని నాని కూడా చంద్రబాబును కలవడం, ఆయనతో ఏకాంతంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతేకాకుండా తాజాగా వైసీపీ ప్రభుత్వంపై కేశినేని నాని మండిపడ్డారు. ప్రపంచమంతా జగన్‌రెడ్డి రాక్షస పాలనను చూస్తోందనీ, రౌడీయిజం, గుండాయిజం ఒక పిరికిపంద చర్య అని విమర్శలు గుప్పించారు. దొంగచాటుగా వచ్చి తమ పార్టీ ఆఫీసులపై దాడికి పాల్పడటం, అద్దాలు పగులగొట్టడం కాదు.. కొట్టుకోవాలనుకుంటే కొట్టేసుకుందాం.. అందుకు తమ వాళ్లు సిద్ధంగా ఉన్నారని వైసీపీకి సవాల్‌ విసిరారు. ఇలా కేశినేని నాని ఎట్టకేలకు బయటకొచ్చి పార్టీ తరపున గళమెత్తారు. దీంతో కేశినేని నాని అలక పాన్పు వీడినట్టేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: