సీఎం జగన్ విశాఖ పర్యటన రద్దయింది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించాల్సి ఉంది. అయితే ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ రాత్రి అకస్మాత్తుగా సీఎం కార్యాలయం నుంచి రద్దు ప్రకటన వెలువడింది. సీఎం జగన్ పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందనేది ఆ ప్రకటన సారాంశం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలా జగన్ పర్యటన రద్దు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ పర్యటన రద్దు విషయం తెలుసుకున్నవిశాఖపట్నం వైసీపీ నేతలు కూడా అసలు పర్యటన ఎందుకు రద్దయిందో ఆరా తీయడం మొదలుపెట్టారు.

జగన్ పర్యటన రద్దు చేసుకోవడానికి అసలు కారణం ఇదేనంటూ టీడీపీ నేతలు మరో విషయం చెబుతున్నారు. సీఎం జగన్ ను విశాఖపట్నంలో టీడీపీ శ్రేణులు అడ్డుకుంటాయని భావించి.. పర్యటన రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. సీఎం తమకు భయపడి వెనక్కు తగ్గారని ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం విశాఖలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో పర్యటిస్తే.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జగన్ ను అడ్డుకుంటారని.. ఈ కారణం కూడా జగన్ పర్యటన రద్దుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
 
విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్టీల్ ప్లాంట్ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో సీఎం జగన్ సరిగా స్పందించడం లేదనే విమర్శలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా అదే ఆరోపణలను ముందుకు తీసుకెళ్తున్నాయి. పూర్తి స్థాయిలో సీఎం ఈ సమస్యపై దృష్టి పెట్టలేదని, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారే కానీ, తర్వాత పట్టించుకోలేదని అనుకుంటున్నారు. అయితే సీఎం టూర్ షెడ్యూల్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కూడా జగన్ కలవాల్సి ఉంది. అయితే ఇలా అకస్మాత్తుగా పర్యటన రద్దవడంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరింత నిరాశకు గురవుతున్నారు. వాస్తవానికి శారదా పీఠం వార్షికోత్సవాలలో కూడా జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే మొత్తం పర్యటన రద్దు కారణంగా ఈ కార్యక్రమం కూడా రద్దయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: