హుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం జోరందుకుంది. అధికార ప‌క్షం, ప్ర‌తి పక్షాలు ప్ర‌చారంలో జోరు పెంచేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల త‌ర‌ఫున ప్రచారం చేయ‌డానికి ఆ పార్టీ ఎంపీలు రంగంలోకి దిగారు. అలాగే... పెట్రోల్ డీజీల్ ధ‌ర‌ల‌ను కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ పెంచిందంటూ టీఆర్ఎస్ త‌ప్పుడు ప్ర‌చారం  చేస్తుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌భుత్వం లీట‌ర్ పెట్రోల్‌పై 41 రూపాయ‌ల‌ను రాష్ట్ర ప‌న్ను కింద వ‌సూలు చేస్తోంద‌ని ఆ డ‌బ్బులు వాప‌స్ ఇస్తే పెట్రోల్ ధ‌ర 60 రూపాయ‌లకు మాత్ర‌మే వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు.


హ‌న్మ‌కొండ జిల్లా క‌మ‌లాపురం మండ‌లంలోని శ‌నిగారం, క‌మ‌లాపుర్ గ్రామాల్లో బండి సంజ‌య్ ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇక రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం కొంటుంటే రాష్ట్ర ప్ర‌భుత్వం బ్రోక‌రిజం చేస్తుంద‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. క‌మ‌లాపూర్ పేరును క‌మ‌ల్‌పూర్ గా మారుస్తామ‌ని బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు శుక్ర‌వారం క‌రీంన‌గ‌ర్ జిల్లా ఇల్లంత‌కుంట మండ‌లంలో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ తో క‌లిసి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు.


ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతోనే ద‌ళిత బంధు వ‌చ్చింద‌ని చెప్పారు. ఆ ప‌థ‌కానికి ఈట‌ల రాజేంద‌ర్ పేరు పెట్టాల‌ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.  అనంత‌రం ఈట‌ల రాజేంద‌ర్  మాట్లాడుతూ.. ఎన్నిక‌ల కోసం ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టించినా.. మ‌ద్యం ఏరులై పారించినా కానీ సీఎం కేసీఆర్  కు హుజురాబాద్ ప్ర‌జ‌ల నాడి అంతు చిక్క‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ ఓటమి ఖాయ‌మ‌యినందు వ‌ల్ల‌నే తండ్రి కొడుకులు హుజురాబాద్ ప్ర‌చ‌రానికి రావ‌డం లేద‌ని బీజేపీ ఎంపీ అర‌వింద్ ధ‌ర్మ‌పురి కూడా ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్రం పెట్రోల్ పై తీసుకుంటున్న ప‌న్నును వాప‌స్ ఇస్తే లీట‌ర్ పెట్రోల్ కేవ‌లం 60 రూపాయ‌ల‌కు మాత్ర‌మే వ‌స్తుంద‌ని కామెంట్ చేశారు బండి సంజ‌య్.

మరింత సమాచారం తెలుసుకోండి: