దేశంలో రాజ‌కీయంగా అత్యంత కీలకమైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అధికార పీఠాన్ని ద‌క్కించుకునేందుకు, అలాగే బ‌ల‌మైన శ‌క్తి గా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వాద్రా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత కాంగ్రెస్ నేత‌ల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌ర‌గ‌బోయే శాస‌న‌స‌భ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు అందులో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిజ్ఞ యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నుంది. నేటి నుంచి ఈ యాత్రలు మొద‌ల‌య్యాయి.


   మొద‌టి ద‌శ‌లో  జ‌రిగే మూడు ప్ర‌తిజ్ఞ యాత్ర‌ల‌ను కూడా వార‌ణాసి, బారాబంకి, ష‌హ‌రాంగ్ పూర్ నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు బారాబంకీలో బారీ బ‌హిరంగ స‌భ నిర్వహించి ప్రియాంక గాంధీ ప్ర‌తిజ్ఞా యాత్ర‌ల‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ యాత్ర‌లు న‌వంబ‌ర్ ఒక‌ట‌వ తేదితో ముగియ‌నున్నాయి. ఇక నాలుగో యాత్ర దీపావ‌ళి త‌రువాత ప్రారంభం అవుతంద‌ని చెబుతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు న‌ల‌భై శాతం టికెట్లు ఇస్తాన‌ని ప్రియాంక గాంధీ వాద్రా ఇప్ప‌టికే హామి ఇచ్చారు. ఈ యాత్ర‌లో మ‌రికొన్ని హామీలు ప్ర‌జ‌ల ముందు పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.


  మ‌రోవైపు ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో భారీ ర్యాలీ నిర్వ‌హించి కాంగ్రెస్ స‌త్తా చాటారు ప్రియాంక గాంధీ వాద్రా. ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ను టార్గెట్ చేస్తున్నారు. త‌న నాన‌మ్మ మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఈ నెల 31న గోర‌ఖ్‌పూర్‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించేందుకు హ‌స్తం పార్టీ సిద్ద‌మ‌వుతోంది. ఈ ర్యాలీకి 2 ల‌క్ష‌ల మందికి పైగా జ‌నాల‌ను స‌మీక‌రించ‌డ‌మే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈసారి యూపీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతున్నాయంటున్నారు. మ‌రి ప్రియాంకా గాంధీ దూకుడుతో కాంగ్రెస్ గ‌త వైభ‌వాన్ని సాధిస్తుందేమో చూడాలి.



 

మరింత సమాచారం తెలుసుకోండి: