జమ్ము కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన చేపడతామన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉందన్నారు. ఆ వెంటనే అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం అమిత్ షా  జమ్మూ కాశ్మీర్ కు చేరుకున్నారు. జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించి ఆర్టికల్ 370 ని కేంద్రం 2019 ఆగస్టులో నిర్వీర్యం చేశాక అమిత్ షా రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం రాజ్ భవన్లో జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారు. సాయంత్రం యూత్ క్లబ్బుల సభ్యులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో యువత భవితకు బంగారు బాటలు పడ్డాయని అన్నారు. కాశ్మీర్లో శాంతి నెలకొల్పేందుకు యువత  ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొన్ని శక్తులు నియోజకవర్గాల పునర్విభజన వద్దంటున్నాయని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సరిహద్దులతో తమ అస్తిత్వం పోతుందని భయం వారిదన్నారు. 75 ఏళ్లుగా రాష్ట్రాన్ని మూడు కుటుంబాలే పాలించయన్న ఆయన  మరి 40 వేల మంది హత్యలు ఎందుకు జరిగినట్లు అని ప్రశ్నించారు. స్వర్గానికి మారుపేరైన కాశ్మీర్లో శాంతి నెలకొల్పడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అంతకుముందు ఆయన శాంతిభద్రతలపై సమీక్ష సందర్భంగా జమ్ము కాశ్మీర్ లోయలో తీవ్రమవుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం పాకిస్తాన్ వైపు నుంచి చొరబాట్ల పై సీరియస్ అయ్యారు. గడిచిన 13 రోజులుగా కాశ్మీర్లోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్లపై అధికారులను ప్రశ్నించారు.

రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎందుకు నిరోధించ లేక పోతున్నారని నిలదీశారు. ఎక్కడికక్కడ భద్రత ఉన్న మైనార్టీలపై, వలసదారుల పై దాడులను ముందుగానే ఎందుకు పసిగట్టడం లేక పోతున్నారన్నారు. మరోవైపు కాశ్మీరీ పండిట్ లు రాష్ట్రానికి తిరిగి రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. లోయలో శాంతి సామరస్యాలు నెలకొనాలంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: