శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పచ్చని పంట పొలాన్ని ట్రాక్టర్ తో తొక్కించారని, జగనన్నా మాకు న్యాయం చేయండి అంటూ ఓ కుటుంబం మీడియా ముందు విలపించింది. తమ బాధ చెప్పుకుంటున్నట్టు ఉన్న వీడియోలను ఇటీవలే విడుదల చేసిన ఆ కుటుంబం ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు నెలల్లో ధాన్యం చేతికొస్తుందనుకున్న టైమ్ లో ఎమ్మెల్యే పద్మావతి తమ నోటిదగ్గర కూడు నేలపాలు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు.

కట్ చేస్తే.. టీడీపీ అనుకూల మీడియాలో శింగనమల ఎమ్మెల్యేపై వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. ఎమ్మెల్యే దాష్టీకం, ఎమ్మెల్యే దౌర్జన్యం అంటూ విమర్శలు మొదలయ్యాయి. బాధితులు విడుదల చేసిన వీడియోలో.. పోలీసులు అడ్డుకుని మరీ పొలాన్ని ట్రాక్టర్ తో దున్నించారు. దీంతో సహజంగానే ప్రజల్లో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరిగింది. అయితే అసలు కథ ఇదీ అంటూ ఎమ్మెల్యే మరో వెర్షన్ చెబుతున్నారు.

కొర్రపాడులో పొలానికి సంబంధించి 29ఏళ్లుగా దారి విషయంలో వివాదం ఉంది. బ్రాహ్మణ కుటుంబానికి ఉన్న పొలానికి దారి ఇవ్వకుండా మధ్యలో మరో సామాజిక వర్గంవారు అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల ఈ సమస్య ఎమ్మెల్యే దృష్టికి రాగా.. ఆమె అన్ని రికార్డులు పరిశీలించి సదరు బ్రాహ్మణ కుటుంబం వైపే న్యాయం ఉందని తేల్చారట. ఈ క్రమంలో వారి పొలానికి దారి ఇచ్చే విషయంలో వరి పంటను ట్రాక్టర్ తో తొక్కించాల్సి వచ్చిందనేది ఎమ్మెల్యే వర్గం వివరణ. అయితే వరిపంటను నష్టపోయిన బాధితులు మాత్రం ఎమ్మెల్యే ఇటీవలే అక్కడ పెద్ద ఎత్తున పొలాలు కొనుగోలు చేశారని, ఆమె పొలానికి దారి వేసుకోడానికి ఇలా తమ పంటచేను తొక్కించేశారని అంటున్నారు. ఈ వివాదం చివరకు సద్దుమణిగిందని, దారి ఇవ్వడానికి వారు ఒప్పుకున్నారని స్థానికులు చెబుతున్నారు. మొత్తమ్మీద మహిళా ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు రావడం, అవి వెంటనే సద్దుమణగడం స్థానికంగా కలకలం రేపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: