తెలంగాణ రాష్ట్ర స‌మితి మూడు ఏళ్ల త‌రువాత ప్లీన‌రి నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌యింది. భాగ్య‌న‌గ‌రంలోని హెచ్ఐసీసీ లో రాష్ట్ర ప్ర‌తినిధుల స‌భ జ‌ర‌గనుంది. 2018 త‌రువాత జరుగుతున్న ఈ స‌భ‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్‌. పార్టీ శ్రేణుల్లో నూత‌న ఉత్తేజం నింపేలా ఈ ప్లీన‌రి జ‌ర‌గనుంది. ఈ స‌మావేశానికి ప్ర‌జా ప్ర‌తినిధులతో పాటు కొత్త సంస్థాగ‌త క‌మిటీల స‌భ్యుల‌ను ఆహ్వానించింది. పార్టీని ప‌టిష్టం చేసేందుకు కార్య‌చ‌ర‌ణ ప్రణాళిక‌ను కేసీఆర్ ఈ వేదిక‌పై ప్ర‌వేశ‌పెట్ట‌నున్నాడు.


  ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్లీన‌రీ ప్రారంభం కానుంది. మొద‌ట‌గా అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించి, త‌రువాత తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేస్తారు కేసీఆర్‌. అలాగే పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. పార్టీ అధ్య‌క్ష ఎన్నిక ప్ర‌క‌ట‌న తరువాత కేసీఆర్ ప్ర‌సంగిస్తారు. అనంత‌రం పార్టీ రాజ‌కీయ‌, జాతీయ, ప్రాంతీయ స్థాయి అంశాల‌పై ఏడు తీర్మాణాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ అంశాల‌ను ఏడుగురు నేత‌లు ప్ర‌తిపాదిస్తారు. అనంత‌రం వాటిపై చ‌ర్చించి ఆమోదిస్తారు.

 

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు స‌హా దాదాపు 7000 మంది ప్ర‌తినిధులు హాజ‌రుకానున్నారు. పురుషులు, మ‌హిళ‌లు గులాబీ రంగు దుస్తులు ధ‌రించి రావాల‌ని పార్టీ అధిష్టానం నిర్దేశించింది. ఇక ఈ గులాబీ పండుగ‌కు పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కానిస్టేబుళ్ల నుంచి డీసీపీల వ‌ర‌కు మొత్తం 15 వంద‌ల మంది బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు. స‌భ‌కు వ‌చ్చే ప్ర‌తినిధుల వాహ‌నాల కోసం ప్ర‌త్యేక పార్కింగ్ స్థ‌లాల‌ను సిద్ధం చేశారు.  



 ఖానామెట్, జ‌య‌భేరి స‌మీపంలో 3 నుంచి 4 వేల వాహనాలు నిలిపేలా మైదానాన్ని చ‌దును చేసి ఉంచారు. న్యాక్ వెనుక‌భాగంలో మ‌రో గ్రౌండ్‌ను సిద్దం చేశారు. ప్ర‌తినిధులు త‌మ వాహ‌నాల‌ను పార్కింగ్ స్థ‌లంలోనే నిలిపి హైటెక్స్‌లోప‌లికి వెళ్లాల్సి ఉంటుంది. రోడ్ల‌పై ర‌ద్దీ నెల‌కొన‌కుండా పోలీసులు ప్ర‌త్యేక రూట్ మ్యాప్ సిద్దం చేసి ట్రాఫిక్ సిబ్బందికి అంద‌జేశారు. ఇక స‌భ ప్రాంగ‌ణాన్ని గులాబీ వ‌ర్ణంతో అలంక‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: