హైదరాబాద్ హైటెక్స్ లో ఈ రోజు జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు చేశారు. గులాబీ బాస్ గా కేసీఆర్ ను లాంఛనంగా ఎన్నుకునే ఈ కార్యక్రమానికి ఆరు వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇందుకోసం ప్రతినిధులకు ప్రత్యేక పాసులు ఇచ్చారు. ఇందుకోసం మహిళలు గులాబీ చీర, పురుషులు గులాబీ చొక్కాతో రానున్నారు.

ఉదయం 11గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది.. ఆ తర్వాత అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఇటీవల మృతి చెందిన 11మంది  పార్టీ నేతలకు సంతాపం తెలుపుతారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగిస్తారు. తీర్మానాలపై చర్చ జరుగుతుంది. మధ్యాహ్న భోజనం విరామం ఇస్తారు. ఆ తర్వాత కేసీఆర్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. ప్రతినిధులతో పాటు వచ్చే అనుచరులకు కలిపి 15వేల మందికి సరిపడా ప్రత్యేక వంటలను సిద్ధం చేస్తున్నారు.

33రకాల శాఖాహారం, మాంసాహార వెరైటీలు ఉంటాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, తలకాయ పులుసు, బోటి ఫ్రై, మటన్ దాల్చా, పాయా సూప్, ఎగ్ మసాలా, బగారా రైస్, వెజ్ బిర్యానీ, రుమాల్ రోటీ, వైట్ రైస్, మామిడికాయ పప్పు, గుత్తి వంకాయ, బెండకాయ కాజు ఫ్రై, పచ్చిపులుసు, ఉలవచారు, పెరుగు, జిలేబీ, ఐస్ క్రీమ్ ఉంటాయి.

ఇక టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట నుంచి సైబర్ టవర్స్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లేవారు రోలింగ్ హిల్స్, ఐకియా, ఇనార్బిట్ మాల్ నుంచి వెళ్లాలి. సైబర్ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వెళ్లేవారు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్, దుర్గం చెరువు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్ సీపురం, చందానగర్, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు బీహెచ్ఈఎల్, నల్లగండ్ల హెచ్ సీయూ మీదుగా వెళ్లాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: