వైఎస్సార్.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి.. తెలుగు నేలను పాలించిన నేతల్లో నందమూరి తారక రామారావు తర్వాత అంతగా ప్రజాభిమానం పొందిన నేతగా పేరు పొందారు. వైఎస్సార్‌ కంటే ముందు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారంతా.. కాంగ్రెస్‌ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నవారే. హైకమాండ్ ఎప్పుడు ఎవరిని సీఎం అని ప్రకటిస్తే.. వారే సీఎం అయ్యారు. ఎప్పుడు ఎవరిని దింపేస్తే వారు కిక్కురుమనకుండా దిగిపోయారు. ఎన్టీఆర్ సీఎం అయ్యే ముందు.. కాంగ్రెస్ పార్టీ మూడేళ్లలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఒక విధంగా ఎన్టీఆర్‌ సీఎం అయ్యేందుకు అది పరోక్షంగా కారణమైంది.


ఒక విధంగా హైకమాండ్ ఆధిపత్యం అన్నది కాంగ్రెస్ సంస్కృతిగా మారింది. దీనికి మొదటిసారి గండికొట్టింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని చెప్పొచ్చు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగా ముద్రపడిన రాజశేఖర్‌ రెడ్డి.. చంద్రబాబు విద్యుత్ ఉద్యమం ద్వారా ప్రజల్లో బాగా చెడ్డపేరు మూటగట్టుకున్నప్పడు పాదయాత్ర ద్వారా ప్రజానేతగా ఎదిగారు. కాంగ్రెస్‌లో తనకు పోటీ లేకుండా చూసుకున్నారు. అలా సొంత ఇమేజ్‌తో సీఎం అయిన తొలి కాంగ్రెస్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.


ఇక వైఎస్సార్ సీఎం అయ్యాక.. ఆయన చెప్పినట్టు హైకమాండ్ నడుచుకోవాల్సి వచ్చింది. అయినా వైఎస్ ఎప్పుడూ హైకమాండ్‌ను ధిక్కరించలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయగలరా.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వైఎస్సార్‌ లా గుర్తింపు తెచ్చుకోలగలరా అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌కు పోటీ వచ్చే నేతలు చాలా తక్కువ. భట్టి విక్రమార్క వంటి ఒకరిద్దరు తప్ప రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు.


రేవంత్ రెడ్డి వైఎస్సార్‌ స్థాయికి వెళ్లాలంటే.. అధికారం అదుకోవాలి. ఒకవేళ అధికారం సాధిస్తే.. ప్రజారంజకంగా పాలించగలగాలి.. అప్పుడే ఆయన మరో వైఎస్సార్ అవుతారు. మరి రేవంత్ ఆ స్థాయికి ఎదుగుతారా లేదా అన్నది ఆయన సాధించే విజయాలను బట్టి ఉంటుంది. చూద్దాం.. రేవంత్‌ భవిష్యత్ ఎలా ఉండబోతోందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: