హుజూరాబాద్ ఉపఎన్నిక పోటీ నుంచి తమ ఇద్దరు అభ్యర్థులు యుగేందర్, తిరుపతి తప్పుకుంటున్నట్టు ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య ప్రకటించారు. తమ అభ్యర్థులు ప్రచారం నిర్వహించరనీ.. టీఆర్ఎస్ కు మద్ధతు ఇస్తున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.

బీజేపీ నేతలు నిత్యావసరాల ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పి ఓట్లడగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్ధతుగా ప్రచారం నిర్వహించిన హరీశ్.. ధరల పెరుగుదల పాపం ముమ్మాటికీ బీజేపీదేనని చెప్పారు. రైతుల మీదకు కారు ఎక్కించిన ఘనత బీజేపీ నేతలది అని విమర్శించారు. హుజూరాబాద్ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని హరీశ్ తెలిపారు.

హుజూరాబాద్ టీఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణాన్ని వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అటు 57ఏళ్లు నిండి వారికి పెన్షన్ ఇస్తామని.. నియోజకవర్గంలో 5వేల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఈటల రాజేందర్ గెలిస్తే నియోజకవర్గానికి ఏం ఇస్తాడో చెప్పాలని హరీశ్ సవాల్ విసిరారు.

ఇక గతంలో నాలు వేల రూపాయలు ఉండే రైతు బంధును తాము 5వేల రూపాయలు చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ రేట్లను భారీగా పెంచుతోందని విమర్శించారు. ఉపఎన్నిక పూర్తి కాగానే గ్యాస్ ధరను మరో 200రూపాయలను పెంచుతుందని అన్నారు. హుజూరాబాద్ లో కారు గుర్తుపై మీట నొక్కితే ఢిల్లీలో ఉన్నవారి గుండెలు అదరాలని ఎన్నికల ప్రచారంలో హరీష్ పిలుపునిచ్చారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ హజూరాబాద్ లో గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పలువురు పోటీ నుంచి తప్పుకొని అధికార పార్టీకి జై కొడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: