హైదరాబాద్ హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధినేత ప్లీనరీ ప్రాంగణంలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరుల కుటుంబాలకు నివాళులర్పించారు. హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్ కు దట్టీకట్టారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కేకే ప్లీనరీలో ప్రకటించారు.

తెలంగాణ పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక్కడి కార్యక్రమాలను అమలు చేయాలని చాలా రాష్ట్రాల్లో డిమాండ్ లు వస్తున్నాయన్నారు. ఏపీలో కూడా టీఆర్ఎస్ పెట్టాలని చాలా మంది అడుగుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని దుష్ప్రచారం చేశారన్నారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ప్రచారం చేశారని చెప్పారు. ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశామని తెలిపారు.

అప్పట్లో ఎన్టీఆర్.. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసినట్టే.. తాను వీఆర్వో వ్యవస్థను రద్దు చేశానని సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి, మొత్తం డిజిటలైజేషన్ చేశామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో కరెంట్ రాదని చెప్పారని.. ఇప్పుడు తెలంగాణలో కరెంట్ ఉంది.. ఏపీలో లేదని తెలిపారు. ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ పథకాలు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారన్నారు.

సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్ర్యం అని అన్నారు కేసీఆర్. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుందన్నారు. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని అని ఉద్యమంలో చెప్పానని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యం చెప్పిందని తెలిపారు. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం తరహాలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని వివరించారు.మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆంధ్రప్రదేశ్ పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి ఆయన ఏపీలో పార్టీ పెట్టబోతున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: