తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికపై ఏర్పడిన ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. ఎస్‌ఈసీ అధికారులు ఎన్నికలను సోమ‌వారం నిర్వహించారు. నగరపాలక సంస్ధ సమావేశంలో ఎన్నిక  నిర్వ‌హించారు.  గతంలో మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగించిన విషయం విధిత‌మే.  ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ త‌రుణంలో  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు ఇవాళ‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల పదవులకు ఎన్నికలు జ‌రిగాయి. .కాకినాడ మేయర్ గా 40 వ వార్డు కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా  డిప్యూటీ మేయర్ గా మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.

మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు ఎవ‌రూ హాజరుకాలేదు.  ఎన్నిక అనంతరం మేయర్‌ శివప్రసన్న మీడియాతో  మాట్లాడారు.  కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు సహచర కార్పొరేటర్ల సహకారం ఎప్పటికప్పుడు తీసుకుంటానని తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఆమె ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు 48 డివిజన్లకు ఎన్నికలు జ‌రిగాయి. అందులో 32 టీడీపీ, 10 వైసీపీ, 03 బీజేపీ, 03 స్వ‌తంత్ర అభ్య‌ర్థులు గెలుపొందారు. అప్పట్లో స్వ‌తంత్రులు  అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో మేయర్‌ వ్యవహారశైలి న‌చ్చ‌క‌పోవ‌డంతో  కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. ఈ పరిణామాలు తారస్థాయికి చేరడంతో.. మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు దూర‌మ‌య్యే పరిస్థితి నెల‌కొంది. కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు  అవిశ్వాసం ప్రవేశపెట్టారు.  ఇందులో మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌ సత్తిబాబులు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. దీంతో పావనీ మేయ‌ర్‌ పదవిని కోల్పోయారు. దీంతో ఆమె కోర్టును ఆశ్ర‌యించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: