బద్వేలు ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరగబోతోంది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఉపఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎక్కడ పోటీ అన్నా ప్రధానంగా వైసీపీ, టీడీపీ బరిలో ఉంటాయి. హోరాహోరీ తలపడతాయి. అయితే..బద్వేలులో మాత్రం ఈసారి చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. అయితే అనేక కారణాల వల్ల బద్వేలులో పోటీ చేయడం లేదని తెలుగు దేశం, జనసేన ప్రకటించాయి. ఆ ప్రకటనతోనే ఇక్కడ వైసీపీ విజయం ఖాయమని తేలిపోయింది.


అయితే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ నుంచి వైదొలగినా బీజేపీ, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులను నిలిపాయి. దీంతో ఎన్నిక అనివార్యం అయ్యింది.  ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన కూడా బరిలో లేదు. అయితే ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు ఎటు మళ్లుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందులోనూ టీడీపీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. మరి ఈ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లుతుందా.. కాంగ్రెస్ అభ్యర్థికి మళ్లుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠభరితంగా ఉంది.


బద్వేలు ఉపఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం బరిలో లేకపోవడంతో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇక్కడ మొత్తం 2.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల త్రిముఖ పోరులో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్న చర్చ నడుస్తోంది. బద్వేలులో బీజేపీ, కాంగ్రెస్‌కు ఎక్కువగా క్యాడర్‌ లేదు. అందుకే ఈ రెండు పార్టీలు టీడీపీ క్యాడర్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. వైసీపీ నేతలు కూడా టీడీపీ క్యాడర్ పై కన్నేశారు.


రాష్ట్రం అధికారం అయితే వైసీపీ, లేకుంటే టీడీపీ.. అందుకే.. ఏదేమైనా మనం మనమే అధికారం పంచుకోవాలన్న లాజిక్‌ను వైసీపీ ప్రయోగిస్తోంది. ఈ లాజిక్‌తో కొన్ని చోట్ల టీడీపీ క్యాడర్ కూడా మెత్తబడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి సహకరిస్తే ముందు ముందు ఎక్కడైనా వైసీపీ అవసరం రాకపోతుందా అన్న ఆలోచనలో టీడీపీ క్యాడర్ ఉన్నట్టు తెలుస్తోంది. అలా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ క్యాడర్ వైసీపీకి ఓటేసేందుకు సిద్ధమవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: