తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నహుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. హుజూరాబాద్, వీణవంక, కమాలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో ఉదయం 7గంటలకే ప్రారంభం కాగా.. రాత్రి 7గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 2లక్షల 36వేల283 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పురుష ఓటర్లు లక్షా 17వేల 933మంది కాగా మహిళలు లక్షా 19వేల 102మంది ఉన్నారు. మొత్తం 106గ్రామ పంచాయతీల్లోని 306కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. 891ఈవీఎంలు, వీవీ ప్యాట్లు 515 వినియోగిస్తున్నారు. 17వందల 15మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి రావాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.  

హుజూరాబాద్ ఉపఎన్నిక మొదలైన కొద్ది సేపటికే ఓ చోట ఈవీఎం మొరాయించింది. ఇల్లంతకుంట 224వ బూత్ లో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. అయితే సాంకేతిక సమస్య కారణంగానే ఈవీఎం పనిచేయడం లేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు లైన్ లో వేచి చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విలువైన ఎన్నికలుగా హుజూరాబాద్ ఉపఎన్నికను అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ఓటు 6వేల రూపాయల నుంచి 10వేల రూపాయల వరకు పంచినట్టు వార్తలొచ్చాయి. టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్.. మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్, గెలిచి పరువు దక్కించుకోవాలని ఈటల చూస్తున్నారు. నేడు జరుగుతున్న పోలింగ్ లో హుజూరాబాద్ ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి.

మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నిక కారణంగా జేఎన్టీయూ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కానీ ఓయూ పరిధిలో జరుగుతున్న పరీక్షలను మాత్రం వాయిదా వేయలేదు. ఇది గమనించి విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలని యూనివర్సిటీ తెలిపింది. అయితే జేఎన్టీయూ పరిధిలో నవంబర్ 1నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ యథావిధిగా కొనసాగుతాయి. అలాగే రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను నిన్న, ఈ రోజు వాయిదా వేశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: