హుజురాబాద్‌ ఉపపోరు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరీగా జరిగింది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు, యువత అనే తేడా లేకుండా క్యూలైన్‌లలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి కూడా క్యూలైన్‌లో ఓటర్లు ఉన్నారు. దీంతో ఈసారి హుజురాబాద్‌లో పాత రికార్డులను బ్రేక్‌ చేస్తూ పోలింగ్‌ శాతం నమోదు అయింది. దీంతో పెరిగిన ఓటింగ్‌ శాతాన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పలు రకాలుగా విశ్లేషించాయి. ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను సైతం వెల్లడించాయి.

హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఫలితాలను ప్రభావితం చేసిన వాటిలో ముఖ్యంగా దళిత బంధుతోపాటు పలు అంశాలను ఎగ్జిట్‌పోల్స్‌ విశ్లేషిస్తున్నాయి. దళిత బంధులో గందరగోళం నెలకొందని,  కొందరికి వచ్చిన దళిత బంధు డబ్బు మళ్లీ వెనక్కి వెళ్లడం వంటి అంశాలు అధికార టీఆర్ఎస్‌ పార్టీకి ప్రతిబంధకంగా మారాయి. అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ వ్యక్తిగత ఇమేజ్‌, సానుభూతి వంటి అంశాలు ఓటర్లపై బాగా ప్రభావం చూపాయి. ప్రజల మనిషిగా ఆయనకు పేరు రావడం కూడా ఓటింగ్ సరళిపై ప్రభావం చూపినట్లుగా  విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక కేసీఆర్‌ సర్కారుపై నిరుద్యోగ యువతలో పెరిగిన అసంతృప్తి ఉపఎన్నిక ఫలితాలపై ప్రభావితం చూపినట్లుగా ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఉద్యోగులు కూడా సర్కారు తీరుపై అసహనంగా ఉన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీస్తున్న పవనాలు.. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారాయని అంటున్నాయి. మహిళా  ఓటర్లు పెద్దఎత్తున కమలం పార్టీ వైపు ఆకర్షితులు అయినట్లు వెల్లడిస్తున్నాయి. ఇక ముదిరాజ్‌, పద్మశాలి, గౌడ, రెడ్డి ఓటర్లు ఈటల రాజేందర్‌ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.

అలాగే హుజురాబాద్‌ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీలిపోయాయి. ప్రభుత్వంపై రైతుల్లోనూ ఆగ్రహం ఉందనీ, అది వ్యతిరేకంగా మారిందని ఎగ్జిట్‌ పోల్స్‌ విశ్లేషిస్తున్నాయి. డబ్బు, మద్యాన్ని అధికార పక్షం విచ్చలవిడిగా పంపిణీ చేసిందని, ఇది సగటు ఓటర్లలో  చెడ్డపేరు తెచ్చేలా చేసిందని అంటున్నాయి. అలాగే పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరల ఎఫెక్ట్‌ ఈ ఉపఎన్నికపై కనిపించకపోవడం బీజేపీకి ఊరట నిచ్చినట్టేనని విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పడిపోవడం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు లాభించిందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలు, దూషణలు వంటివి జనంలో బాగా చర్చ జరిగాయని, ఇన్నాళ్లు టీఆర్ఎస్‌లో ఉన్న ఈటలను బయటకు పంపడం ద్వారా ఆయనకు అన్యాయం జరిగిందని, అందుకే గులాబీ నేతల పట్ల వ్యతిరేకత పెరిగిందని విశ్లేషిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: