హుజురాబాద్ ఉప ఎన్నిక అన్ని కులాల మధ్య అంతరం పెంచేలా చేసిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. హుజురాబాద్‌ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్‌.. గెలుపు  కోసం కుల సంఘాల నేతలను రెచ్చగొట్టడంలో ఆ పార్టీ సఫలం అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆయా వర్గాల అభ్యున్నతికి కోసం పాటు పడుతున్నామని చెప్పుకున్న నేతలు.. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అణుకువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు సొంత ఎజెండా కోసం పనిచేస్తూ అసలు ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. దీనికి  హుజురాబాద్ ఉప ఎన్నిక కేంద్ర బిందువు అవడం హాట్ టాపిక్‌గా మారింది.

బీసీ సంఘాల ప్రతినిధిగా ఆర్. కృష్ణయ్య ఎనలేని పోరాటం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా రాజకీయాల్లో ఆయన తీసుకున్న స్టాండ్‌పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో ఆయన ఎల్బీనగర్ శాసనసభ్యుడుగా గెలుపొందిన తర్వాత చాలా వరకు బీసీ సంఘాలు బలహీన పడ్డాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన దగ్గర శిష్యరికం చేసిన జాజుల శ్రీనివాస్ గౌడ్ 2017 ఏప్రిల్ 11న సొంత కుంపటి పెట్టుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి.

వాస్తవానికి ఆర్.కృష్ణయ్య నుంచి వేరుపడి సొంత కుంపటి పెట్టేలా జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను ఈటల రాజేందర్ రాయబారంతో  స్వయంగా కేసీఆర్‌ ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మంద కృష్ణ మాదిగను బలహీన పరిచేందుకు కూడా కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలే చేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే తనను, తన వాళ్లను దూరం చేసేలా చేసిన ఈటల రాజేందర్‌ మీద ఆర్.కృష్ణయ్యకు కాస్త కోపం ఉందట. అయితే అప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ ఎలా చెబితే.. ఈటల అలాగే చేశారట. కానీ ఇప్పుడు కేసీఆర్‌ను నిందించకుండా... బీసీ సంఘాల ప్రతినిధులు ఈటల మీద దుమ్మెత్తిపోస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

2013 డిసెంబర్ నెలాఖరులో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో భారీ స్థాయిలో బీసీ గర్జన సభ పెట్టారు. అప్పుడు బీసీ డిక్లరేషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు మీద మిర్యాలగూడలో పోటీ చేసి ఓడిపోయిన ఆర్.కృష్ణయ్య.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లుకు మద్దతు ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. త్వరలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలోనే గెల్లుకు బీసీలు ఓటు వేయాలనే డిమాండ్‌ తెర మీదకు తీసుకొచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తంమీద అర్‌.కృష్ణయ్య త్వరలో కారు ఎక్కడం ఖాయమని ఆయన సన్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: