ఏపీలో అమ్మఒడికి షాకిచ్చేందుకు రెడీ అయింది రాష్ట్రప్రభుత్వం. ఇక నుంచి ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విద్యార్థులను ప్రతీరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చేసేందుకు ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఏడాదిలో కనీసం 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం వర్తించేలా నిబంధనలు విధిస్తోంది. ఇకనుంచి ప్రత్యేకమైన యాప్ ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నమోదు చేస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు, పథకం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించేందుకు విద్యార్ధుల్లో క్రమశిక్షణ తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇప్పటి వరకూ విద్యార్థుల హాజరు గురించి టీచర్లు చెప్పిందే అధికారులు రాసుకునేవారు. కానీ తొలిసారిగా ఇప్పుడు విద్యార్థుల అటెండెన్స్ బయోమెట్రిక్ పద్ధతి ద్వారా రికార్డ్ చేయబోతున్నారు. అంటే అంతా పక్కాగా ఆన్ రికార్డ్ ఉంటుంది. ఏమాత్రం హాజరు తగ్గినా ఎక్కడా సరిదిద్దుకునేందుకు అవకాశమే ఉండదు. అంటే అమ్మఒడి దక్కాలంటే కచ్చితంగా ప్రతిరోజూ పిల్లలు బడికి వెళ్లాల్సిందే.

ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులందరికీ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు అందిస్తున్నారు. వీటితో పాటు అర్హులైన తల్లులకు అమ్మఒడి 15వేల రూపాయల ఆర్థిక సాయం అదనం. మధ్యాహ్నం విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా భోజనం అందిస్తున్నారు. ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా తీర్చి దిద్దుతున్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే బయోమెట్రిక్ హాజరు నమోదు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం వలన విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించవచ్చని అధికారులు చెబుతున్నారు.

బయోమెట్రిక్ హాజరు విధానం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో అమలవుతోంది. ఇక్కడ లోపాలను పరిశీలించిన అనంతరం, రాష్ట్రం మొత్తం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తారు. బయోమెట్రిక్ విధానం వలన విద్యార్థులు ప్రతీరోజూ స్కూళ్లకు వస్తున్నారో లేదో.. ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఒకవేళ విద్యార్థులు పాఠశాలకు రాకపోతే.. వెంటనే వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తారు. ఈ నూతన విధానం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమే..


మరింత సమాచారం తెలుసుకోండి: