అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య తలెత్తిన సరిహద్దు గొడవ రావణకాష్టంలా రగులుతోంది. మూడు నెలల క్రితం రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన కాల్పుల ఘటన తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. సరిహద్దులోని కచార్ జిల్లాలో అప్పట్లో చిన్నగా మొదలైన ఘర్షణలు చినికి చినికి గాలివానలా మారాయి. ఆరుగురు పోలీసుల సహా ఏడుగురిని బలిగొన్నాయి. అసోం పోలీసులపై అత్యాధునిక తుపాకులతో మిజోరాం పోలీసులు కాల్పులు జరపడంతో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. ఉద్రిక్తతలు తలెత్తాయి. మిజోరం పోలీసుల తూటాలకు అసోం పోలీసులు బలయ్యారు. ఆ తర్వాత కూడా రెండు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. చివరకు కేంద్రం జోక్యంతో ఘర్షణ వాతావరణం సద్దుమణింది.

నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ సరిహద్దు వివాదం తాజాగా మరోసారి భగ్గుమంది. హైలాఖండి జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దు దగ్గర పోలీస్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే అసోం పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సమీపంలో అనుమానాస్పద రీతిలో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడు మిజోరం పోలీసుగా విచారణలో గుర్తించారు. బాంబు పేలుడుకు అతడే కారణమని విచారణలో వెల్లడి కావడంతో ఐపీసీ 120(బి), 447 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామంతో ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు, రెండ్రోజుల క్రితం కైచుర్తాల్ ప్రాంతంలోని బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అసోం పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆగస్టు నెలలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత ఈ వంతెన నిర్మాణం నిలిచిపోయింది. అయితే ఇటీవల అసోం అభ్యంతరాలు, కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని మిజోరం నిలిపేసిందని, కానీ అక్టోబర్ 26వ తేదీన పనులు మొదలుపెట్టినట్లు గుర్తించామని హైలాఖండి జిల్లా ఎస్పీ ఉపాధ్యాయ్ తెలిపారు. అసోం పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి.. అప్పటికే నిర్మాణ సామగ్రి, పరికరాలను అక్కడే విడిచిపెట్టి వారంతా వెళ్లారని ఆయన చెప్పారు. మొత్తంమీద అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య తలెత్తిన సరిహద్దు గొడవ రావణకాష్టంలా రగులుతుండటంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ రెండు రాష్ట్రాల ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: