హుజూరాబాద్‌ ఉపఎన్ని పలు వివాదాలకు వేదిక అయింది. తాజాగా వీవీ ప్యాట్ల తరలింపుపై రాజకీయ సెగ రగులుతోంది. హుజూరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 86.57 శాతం పోలింగ్‌ నమోదైంది. 306 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 2,37,022 మందికి ఓటర్లకుగాను 2,05,053 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాగ్వివాదాలు, ఘర్షణలకు మరికొన్ని పోలింగ్‌ కేంద్రాలు వేదిక అయ్యాయి. పలుచోట్ల టీఆర్‌ఎస్‌ నేతలు, స్థానికేతరులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.  బరిలో ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు ఉన్నా.. పోటీ మాత్రం బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే నువ్వా- నేనా  అన్నట్లు సాగింది. పోలింగ్‌ అనంతరం ఆరు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించగా.. ఈటల రాజేందర్‌ గెలుస్తారని ఐదు సంస్థలు అంచనా వేశాయి. ఒక్కటి మాత్రం టీఆర్‌ఎస్‌కు ఓటేసింది.

ఇదిలావుంటే, కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో ఉప ఎన్నిక వీవీ ప్యాట్‌ తరలింపు కలకలం సృష్టించింది. ఒక వాహనంలో నుంచి మరో వాహనంలోకి వీవీ ప్యాట్‌ తరలిస్తున్న వీడియో రాత్రి వైరల్‌గా మారింది. రోడ్డుపై వీవీ ప్యాట్‌ను తరలిస్తున్న వ్యక్తిని బీజేపీ నేతలు నిలదీశారు. అక్కడికి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో వీవీ ప్యాట్‌ తరలింపుపై అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దన్నారు. ఉప ఎన్నికకు ముందు పని చేయని వీవీ ప్యాట్ ను అధికారిక  వాహనం నుంచి మరొక అధికారిక వాహనంలో తరలించామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.. ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిసెప్షన్ సెంటర్ రోడ్డు ఎదురుగా ఒక  వాహనం నుండి మరొక అధికార వాహనంలో గోడౌన్‌కు తీసుకువెళ్తున్నామని ప్రకటించారు. ఆ దృశ్యాలను అనుమానంతో ఒకరు వీడియో తీసి వైరల్ చేశారని, అది నిజం కాదని అన్నారు.

అయితే వీవీ ప్యాట్‌ తరలింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఏంలు మార్చేందుకు కుట్ర చేసినట్లు సందేహాలు వస్తున్నాయన్నారు. వీవీ ప్యాట్‌ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. ఓటుకు రూ. 6 వేలు పంచి ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేశారని సంజయ్ ఆరోపించారు.  కేసీఆర్.. ప్రజా విశ్వాసం కోల్పోయారని మండిపడ్డారు. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ నీచమైన అకృత్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఓడిపోతామని తెలిసి చివరకు ఈవీఎంలను కూడా ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ను బీజేపీ నేతలు కలిశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, పలువురు బీజేపీ నేతలు సీఈవోను కలిసి ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా వినతి పత్రం అందించారు. వీవీ ప్యాట్ల అంశంపై ఎన్నికల అధికారి ఎలా స్పందిస్తారో? ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: