తెలంగాణ రాష్ట్రమంతా హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. రాష్ట్రంలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన రావడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లుగా ఇదివరకు పనిచేసిన ఆకుల లలిత, ఫరుదుద్దిన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావు, బోడ కుంట వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవి కాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగిసింది. అంతకు ముందే ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా... కరోనా కారణంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అంతకు ముందు నుంచే ఖాళీ అయిన స్థానంలో చోటు దక్కించుకునేందుకు టీఆర్ఎస్ లోని కొంతమంది ముఖ్య నేతలు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు డిసెంబర్ 1వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఆదేశించింది ఈసీఐ. ఇక నవంబర్ 9వ తేదీన నోటిఫికేషన్ ను ఇవ్వనున్నారు.16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 17వ తేదీన నామినేషన్ల పరిశీలన చేయాలని ఈసీఐ సూచించింది. నవంబరు 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.  29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 29 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అదే రోజు ఫలితాల విడుదల చేయనున్నట్లు ఈసీఐ పేర్కొంది. మొత్తంగా డిసెంబర్ ఒకటో తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఆరు స్థానాలు కూడా టీఆర్ఎస్ కే దక్కనున్న నేపథ్యంలో పార్టీలోని చాలామంది నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన కోటిరెడ్డి, భూపాలపల్లి జిల్లా మధుసూదనాచారి కి హామీ ఇచ్చారు. వీరే కాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. నిజమాబాద్ జిల్లా నుంచి మండవ వెంకటేశ్వరరావు, ఆకుల లలిత కూడా ఆశిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి క్యామ మల్లేష్, తీగల కృష్ణారెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి వీరిలో ఎవరెవరిని ఎమ్మెల్సీ పదవి వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: