ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2కు గుడ్ బై చెబుతూ.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని యథావిధిగా జరుపుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ, ఏపీలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి బైబై చెప్పారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అవతరణ వేడుకలను నవనిర్మాణ దీక్షలుగా మార్చేశారు. ఏటా జూన్ 2వ తేదీ నుంచి అదే నెల 8వ తదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ సంప్రదాయానికి సీఎం జగన్ స్వస్తి పలికారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను నవంబర్ 1న ఎట్టి పరిస్థితుల్లో జరిపితీరాలని నిర్ణయించుకున్నారు. పొట్టి శ్రీరాముులు లాంటి ప్రముఖుల త్యాగాలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను నిర్వహిస్తున్నారు.  

ఇక అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాటంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మనకు స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే అంకిత భావం, చిత్తశుద్ధితో ఏపీని సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని సీఎం అన్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రజలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని నారీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. రాష్ట్ర ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారుపేరు. అందుకే వారు అనే రంగాల్లో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా.. ఆరోగ్యంగా ఉంటూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.

ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎంకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభివృద్ధి విషయంలో ఏపీ వెలుగొందుతోందని కొనియాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రజలకు విషెస్ చెప్పారు. ఏపీ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీకి సాంస్కృతిక వారసత్వం, కావాల్సినన్ని సహజ వనరులను కలిగి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన  పొట్టి శ్రీరాములును గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతేకాదు దేశభాషలందు తెలుగు లెస్స అనే విధంగా తెలుగు జాతి గర్వించేలా ఉందన్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: