అమరావతి ఉద్యమం 700 రోజులకు చేరువ అవుతున్న క్రమంలో ఇవాళ్టి నుంచి ఆ ప్రాంత రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి ఉద్యమం 685వ రోజున మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమరావతి ప్రాంత ప్రజలతో కలిసి రైతులు కదం తొక్కుతున్నారు. వారికి దారిపొడవునా గ్రామస్థులు సంఘీభావం పలుకుతున్నారు. అలాగే రైతుల మహా పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. అయితే అమరావతి ఉద్యమానికి గతంలో మద్దతు పలికి ఆ పోరాటాన్ని హోరెత్తించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మౌనమునిగా మారడం హాట్‌టాపిక్‌ అయ్యింది. రైతుల మహా పాదయాత్రపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తనదైన శైలిలో స్పందించి.. ఉద్యమాన్ని మరింత హోరెత్తిస్తారని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు ఆశగా ఎదురు చూశారు. అయితే ఆయన నుంచి ఆ స్థాయిలో స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గతంలో అమరావతి ఉద్యమంలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంటుందని, అది అమరావతేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా అమరావతి కదలదు, జనసేన పార్టీ నిద్రపోదు అని కూడా ఆయన ప్రతిన బూనారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిటి తీసుకొస్తాననీ, అలాగే కేంద్ర సర్కారుతో మాట్లాడొస్తానని చెప్పిన పవన్‌.. ఆ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి చర్చలు కూడా జరిపారు. అయితే చర్చల తర్వాత నుండి జనసేనాని సైలెంట్‌గా మారార. కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ పెద్దలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం తర్వాత నుంచి ఆయన అమరావతి ఉద్యమంపై ఎక్కువగా మాట్లాడటం లేదన్న టాక్‌ వినిపిస్తూ వస్తోంది.

ఇక ఇదే క్రమంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు ముందు రోజు పవన్‌ కల్యాణ్‌... విశాఖలో 262 రోజులుగా కొనసాగుతున్న ఉక్కు కార్మికుల దీక్షలకు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రుల్లో పోరాడే తత్వం లేకపోడవం వల్లే ఉద్యమాలు ఊపందుకోలేక పోతున్నాయనీ, అదే తెలంగాణ ఉద్యమం మారుమూల గ్రామాల్లో సైతం హోరెత్తిపోయిందనీ, అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్న విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ వక్కాణించారు. అయితే 685 రోజులుగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమం కూడా రాష్ట్రమంతటా లేదు. పైగా అది కేవలం అమరావతి ప్రాంతానికే పరిమితమైంది. అయినప్పటికీ ఆయన కేవలం విశాఖ ఉక్కు పోరాటం గురించే ప్రస్తావించారు తప్ప.. అమరావతి ఉద్యమం గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

ఇదిలావుంటే, విశాఖ ఉక్కు కష్టాల్లో ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అయితే విశాఖ ఉక్కు లాభాల్లో ఉందని అధికార వైసీపీ నాయకులు అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఎజెండాను విశాఖకు మోసుకువచ్చారని, అందుకే విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని చెప్పి.. దాన్ని ప్రైవేటుపరం చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి, తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని పవన్‌ కల్యాణ్‌ మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఒకవేళ అధికార వైసీపీ చెబుతున్నట్లే విశాఖ ఉక్కు లాభాల్లో ఉంటే.. దాన్ని ప్రైవేటు పరం చేయడం ఎందుకు? ఇదే సమయంలో ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందంటున్న పవన్‌ కల్యాణ్‌ మాటల్లో నిజమెంత? అన్న సంశయంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు? మొత్తంమీద పవన్‌ కల్యాణ్‌.. ప్రస్తుతం అమరావతి రైతుల మహా పాదయాత్ర సమయంలో సైలెంట్‌గా వ్యవహరిస్తుండటంతో.. ఆయనపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, వాదనలు బలపడుతున్నాయన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: