కేసీఆర్‌ ఆధిపత్యానికి.. ఈటల రాజకీయ భవిష్యత్తుకు మధ్య అన్నట్లుగా జరిగిన హుజురాబాద్‌ ఉపఎన్నికలో అంతిమ విజయం రాజేందర్‌నే వరించింది. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలంటూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పట్టిన పట్టుకు, పోరాట పటిమకు గెలుపు దాసోహం అయింది. ఒక రకంగా చెప్పాలంటే.. హుజురాబాద్‌ బైపోల్‌ ఈటల రాజేందర్‌కు లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్యలా, తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంలా మారింది. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు మంచి పట్టు ఉన్నప్పటికీ.. ఆయన ఉపఎన్నిక ముందు వరకు టీఆర్ఎస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో తనను అణచివేస్తున్నారన్న ఆవేదనతో ఈటల రాజేందర్‌ పలు సార్లు చేసిన వ్యాఖ్యలు.. గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇదే సమయంలో ఈటల రాజేందర్‌పై వచ్చిన భూఆక్రమణ, అవినీతి ఆరోపణలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న పలు పరిణామాలతో కలత చెందిన ఈటల రాజేందర్‌.. టీఆర్ఎస్‌ పార్టీకి, తన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన రాజీనామాతో హుజురాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. అయితే హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ అభ్యర్థి ఎవరిని నిలబెట్టినా.. ఈటలకు కేసీఆర్‌తోనే పోటీ అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. అలాంటిది ఆయనకు ఎదురొడ్డి నిలబడిన రాజేందర్‌.. పోరాడి విజయం సాధించారన్న చర్చ జరుగుతోంది.

ఈటల రాజేందర్‌ అనే వ్యక్తి పెద్ద అవినీతి పరుడు, కబ్జాకోరు, దళితుల భూములు ఆక్రమించుకున్నారు, వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు అన్న రకరకాల ఆరోపణల మధ్య ఆయన టీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చారు. కాదు గెంటివేయబడ్డారు అన్న వాదనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈటల మీద కేసులు కూడా నమోదు చేసి విచారణ కూడా సాగించారు. దీంతో ఒక దశలో ఈటల రాజేందర్‌కు జైలు జీవితం తప్పదేమో అన్న వాతావరణం క్రియేట్‌ అయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన బీజేపీలో చేరడం, ఆ పార్టీ తరపున హుజురాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయడం, ఎన్నికలకు ముందు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా అధికార టీఆర్ఎస్‌ పార్టీ హుజురాబాద్‌లో గెలుపు కోసం అన్ని రకాలుగా అధికారాన్ని ఉపయోగించిందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల అధికారులను ప్రభావితం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీకి కొన్ని కలిసొచ్చే అంశాలు ఉన్నప్పటికీ.. లోకల్‌గా అధికారం కలిగిన రాష్ట్ర సర్కారు కనుసన్నల్లోనే అన్ని బలగాలు నడుచుకున్నట్లుగా పరిస్థితి కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వా- నేనా అన్నట్లుగా హోరా హోరీగా సాగిన హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ పోరాడి గెలిచారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: