ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న పలు విధానాలను ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తూనే ఉన్నాయి. ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ, అమ్మఒడి వంటి పథకాల అమలుపై ఇప్పటికే ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలు అధ్యయనం చేశాయి కూడా. ఈ పథకాలు అమలవుతున్న తీరును కూడా పరిశీలించాయి. ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ ఏడాది మే నెలలో తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ వినూత్న నిర్ణయాలతో విశేష ప్రజాదరణ పొందారు కూడా. పథకాల పేర్ల మార్పు, ప్రభుత్వ పథకాల అమలులో ఫోటోల ముద్రణ వంటి ఎన్నో నిర్ణయాలతో ప్రజాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే విధంగా పోలీసు శాఖలోని ఉద్యోగుల కోసం స్టాలిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా పోలీసులకు వీక్లి ఆఫ్ విధానాన్ని అమలు చేయాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు శాఖకు వీక్లీ ఆఫ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని జగన్ సర్కార్ పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది ఇప్పుడు. ఇదే విధానాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు స్టాలిన సర్కార్ నిర్ణయించింది. గ్రేడ్ - 2 స్థాయి కానిస్టేబుల్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్ వరకు ఉన్న పోలీసులందరికీ కూడా వీక్లీ ఆఫ్ విధానం వర్తించనుంది. ఈ మేరకు తమిళనాడు హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సెప్టెంబర్ 13వ తేదీన అసెంబ్లీ సాక్షిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఇచ్చిన హామీని ఇప్పుడు స్టాలిన్ నిలబెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలతో రూపొందించిన జీవోను హోమ్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకు వీక్లీ ఆఫ్ విధానం తప్పని సరి అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. మానసికంగా, శారీరకంగా కూడా పోలీసులకు విశ్రాంతి తప్పనిసరి అని వెల్లడించారు స్టాలిన్. ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులతో గడిపే హక్కు ఉంటుందని... అందుకు వీక్లీ ఆఫ్ తప్పనిసరి అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: